కళ్ల ముందు... కదలాడుతూ.. 

Animated Lessons For Tenth Students In Siddipet District - Sakshi

సిద్దిపేట జిల్లాలో టెన్త్‌ విద్యార్థులకు యానిమేటెడ్‌ పాఠాలు 

క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా పాఠాలు 

పిల్లలు ఇష్టంగా చదివేలా రూపకల్పన 

కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌ పేరుతో సర్కారు బడుల విద్యార్థులకు  

మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో 11వేల మందికి పంపిణీ  

సాక్షి, సిద్దిపేట: చదివిన దాని కన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. అంతకుమించి బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 2డీ, 3డీ యానిమేషన్‌ దృశ్యరూప విద్యాబోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. 3డీ యానిమేషన్‌లో కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాలను అందిస్తున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించి, మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా సర్కారు బడుల్లోని టెన్త్‌ విద్యార్థులకు అందిస్తున్నారు. 

మళ్లీ మొదటిస్థానం కోసం.. 
2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో మొదటి స్థానాన్ని తిరిగి సాధించేందుకు మరింత కృషి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌ పేరుతో హైదరాబాద్‌కు చెందిన మంత్ర లెర్నింగ్‌ అకాడమీ... 3డీ యానిమేటెడ్‌ పాఠాలు, స్టడీ మెటీరియల్‌ రూపొందించింది. మంత్రి హరీశ్‌రావు రూ.20లక్షలకు పైగా వెచ్చించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించారు. జనవరి 24న సిద్దిపేటలో ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ స్టడీ మెటీరియల్‌ను హరీశ్‌రావు అందించి ప్రారంభించారు. 


కేసీఆర్‌ డిజిటల్‌ కంటెంట్‌ పుస్తకాలను అందజేస్తున్న మంత్రి హరీశ్‌ రావు(ఫైల్‌) 

నాలుగు సబ్జెక్ట్‌లు.. 
గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం నాలుగు సబ్జెక్టుల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలు 3డీ యానిమేషన్‌లో అందిస్తున్నారు. ఒక్కో పాఠ్యాంశానికి ఒక్కో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచారు. 30 సెకన్ల నుంచి 5 నిమిషాలపాటు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. తరగతి గదుల్లో గంటల వ్యవధిలో బోధించే పాఠాన్ని ఐదు నిమిషాల్లో అర్థం చేసుకునేలా రూపొందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి మొబైల్‌ ఫోన్ల ద్వారా దృశ్య రూపంలో పాఠాలను సులువుగా అభ్యసించే అవకాశం ఉంది. 

తల్లిదండ్రులకు హరీశ్‌ లేఖ.. 
‘మీ పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైంది. వారి భవిష్యత్‌కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి’ .. అంటూ తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. 

దృశ్యాలతో కళ్ల ముందు 
మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్‌ పూర్తయింది. ప్రస్తుతం రివిజన్‌ క్లాస్‌లు జరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్లోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో 3డీ యానిమేషన్‌ ద్వారా పాఠ్యాంశాలు వస్తున్నాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. 
– అక్షయ, టెన్త్‌ విద్యార్థి, ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌

సిద్దిపేటకు పేరు తేవాలి.. 
2021–22లో పదోతరగతిలో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ çస్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్‌ పాఠాలను అందిస్తున్నాం. తల్లిదండ్రుల ఫోన్‌లో ఉదయం, రాత్రి వేళల్లో డిజిటల్‌ పాఠాలు వింటూ మెళకువలు నేర్చుకోవాలి. బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలి.  
– హరీశ్‌ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top