
నేటిలోగా పొన్నం క్షమాపణ చెప్పాలని అడ్లూరి అల్టిమేటం
లేదంటే ఖర్గే, సోనియా, రాహుల్‌ను కలుస్తానని హెచ్చరిక
మంగళవారం వైరల్ అయిన ‘లక్ష్మణ్‌కుమార్ వీడియో’
ఆ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి
అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు
మరో మంత్రి వివేక్ వెంకటస్వామి వైఖరినీ తప్పుబట్టిన లక్ష్మణ్
వాడి లెక్కెంత అన్న ఆలోచనతోనే ‘నేను వెళ్లిపోతా’ అన్నాడని వ్యాఖ్య
మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడమే నేను చేసిన పొరపాటా? అంటూ ఆవేదన
ముదురుతున్న మంత్రుల వ్యాఖ్యల వివాదం
టీపీసీసీ చీఫ్‌తో దళిత ఎమ్మెల్యేల భేటీ
బుధవారం మంత్రులను పిలిపించి మాట్లాడతానన్న మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ.
కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్‌కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్‌గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రంగంలోకి దిగారు.
ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా..
తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్‌లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది.
నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా?
తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్‌బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని.
పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు..
పొన్నం ప్రభాకర్‌లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు.
పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు..
పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా.
నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు..
ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్‌కుమార్‌ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్‌కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్‌గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు.
ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్
దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్‌లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్‌బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు.
పీసీసీ చీఫ్‌కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం
అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్‌నగర్‌లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్‌గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు.