breaking news
laxman kumar
-
పొన్నంకు ‘లక్ష్మణ’ రేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్‌కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్‌గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది. నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా? తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్‌బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని. పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు.. పొన్నం ప్రభాకర్లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు. పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు.. పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు.. ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్‌కుమార్‌ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్‌కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్‌గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు. ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్ దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్‌బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు. పీసీసీ చీఫ్‌కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్‌నగర్‌లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్‌గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు. -
ధర్మపురి వివాదంలో మరో ట్విస్ట్.. కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల జిల్లా: మరోసారి ధర్మపురి ఎన్నికల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగలగొట్టిన సంగతి తెలిసిందే.. అయితే, నాలుగు బాక్సులకు మినహా మిగతా వాటికి తాళాలు లేవని, అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొంది. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చదవండి: ధీరుడు కన్నీళ్లు పెట్టడు.. రేవంత్ నీతో నాకు పోలికేంటి..? ఈటల కౌంటర్ కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. -
ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టాలని జిల్లా కలెక్టర్‌కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశ పూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్స్మిత్ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. అంతకు ముందు, ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేపోయారు. -
ధర్మపురి: స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. ఈ సందర్బంగా తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. 2018లో లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. కాగా, కొప్పుల విజయంపై లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారు. దీంతో, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలి
మంచిర్యాల రూరల్/అర్బన్, న్యూస్‌లైన్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలు, నిరుద్యోగులకు ఏటా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎ.లక్ష్మన్‌కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ నిబంధనలు అమల్లోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణాల లక్ష్యం నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో ద రఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల దరఖాస్తులను పరిశీలించి, అర్హులను ఎంపిక చేశామని, ఆయా వివరాలు బ్యాంకర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరక యాదయ్య అందిస్తారని అన్నారు. బ్యాంకర్లు ఈనెలాఖరులోగా అనుమతిస్తే.. ప్రభుత్వం నుంచి వారంలోగా వారి ఖాతాలో జమచేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందరిలోనూ వెలుగులు నింపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచినట్లు వివరించారు. లక్ష రూపాయల రుణం తీసుకున్న లబ్ధిదారులకు 60 వేలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భర్తను కోల్పోయిన ఎస్సీ మహిళలను గుర్తించాలని, వారికి కార్పోరేషన్ తరఫున రూ.50 వేలు అందిస్తామన్నారు. ఫిభ్రవరి 10వ తేదీలోగా సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు పంపుసెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు అందించాలని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఇళ్లల్లో 50 యూనిట్లు తక్కువ విద్యుత్ వాడే వారి వివరాలు సేకరించాలన్నారు. అనంతరం బ్యాంకర్లు, అధికారుల సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో మంచిర్యాల ఎంపీడీవో కె.నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, తహశీల్దార్ రవీందర్రావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రవీందర్, ఈవోపీఆర్డీ శంకర్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తయినట్లే తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపేందుకు రాష్ట్రపతి మరో వారం రోజుల గడువు ఇచ్చారని, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పార్లమెంటు సమావేశంలోనే బిల్లు ఆమోదం పొంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాలకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై సీఎం కుట్రలు పనిచేయవని, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడో పూర్తి చేసిందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నిబంధనలు పూర్తయ్యాయన్నారు. తదుపరి మంచిర్యాలకు వెళ్లిన ఆయన రహదారులు, భవనాలశాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువకులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించి స్వయం పొందాలనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.296 కోట్లు సబ్సిడీ కింద, రూ.200 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని రెండో వారంలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. అనంతరం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.