రాచాపూర్‌లో ఉద్రిక్తత.. మహిళ మృతదేహాన్ని ఇంటిపక్కనే పూడ్చి..

Adilabad: Corpse Buried Inside House Conflict Between Two Families - Sakshi

మహిళ మృతదేహాన్ని ఇంటిపక్కనే పూడ్చడంతో మొదలైన వివాదం

మృతదేహాన్ని తొలగించాలని రోడ్డుపై గ్రామస్తుల ఆందోళన

పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన వివాదం 

సాక్షి,లక్ష్మణచాంద(అదిలాబాద్‌): మండలంలోని రాచాపూర్‌ గ్రామంలో ఓ వర్గానికి (క్రిస్టియన్‌) చెందిన ఫాదర్‌ భార్య అనారోగ్యంతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం మండలంలోని రాచాపూర్‌లోని ఆమె నివాసానికి తీసుకొచ్చి ఇంటిపక్కనే పూడ్చారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కులమత బేదాలు లేకుండా గ్రామంలో ఎవరు చనిపోయిన వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చడం సరికాదని రోడ్డుపై బైఠాయించారు.  మృతదేహాన్ని ఇక్కడ నుంచి తొలగించి వైకుంఠ«ధామానికి తరలించాలని డిమాండ్‌ చేశారు. 

ఇరువర్గాల మధ్యన ఘర్షణ..
రాచాపూర్‌లోని మహిళ ఇంటి వద్ద రోడ్డుపై ఓ వర్గానికి చెందిన (క్రిస్టియన్‌) వారికి రాచాపూర్‌ గ్రామస్తుల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న సోన్‌ సీఐ రాంనరసింహారెడ్డి, లక్ష్మణచాంద, సోన్, మామడ ఎస్సైలు, సిబ్బందితో వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంటి పక్కనే పూడ్చిన మృతదేహాన్ని తొలగించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని గ్రామస్తులు ఆందోళన తీవ్రతరం చేశారు. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. 

మృతదేహం తొలగింపుతో... 
చివరకు సీఐ రాంనరసింహారెడ్డి ఇరువర్గాల వారితో విడివిడిగా మాట్లాడారు.  చివరకు సీఐ సూచనల మేరకు మృతదేహాన్ని బయటకు తీసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి తరలించారు. దీంతో ఆందోళన సర్దుమణిగింది.  

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top