
పారిశ్రామికీకరణతోపాటు ప్రమాదాల్లోనూ పెరుగుతున్న వేగం
గత ఐదేళ్లలో 600కు పైగా ప్రమాదాలు.. 1,116 మంది మృతి
రసాయన, ఔషధ పరిశ్రమల్లోనే ఎక్కువగా..
డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో ఇన్‌స్పెక్టర్ల కొరత.. భద్రతా తనిఖీల్లో వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామీకరణతోపాటు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రమాదాలు కార్మికుల ప్రాణాలు, వారి జీవన స్థితిగతులతోపాటు పరిశ్రమల భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపే రీతిలో ఉంటున్నాయి. రసాయన, ఔషధ, టెక్స్‌టైల్, ఆహార సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కు వగా చోటుచేసుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏటా ప్రమాదాలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లోని జీడిమెట్ల, జిన్నారం, గడ్డపోతారం, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర పారిశ్రామిక వాడల్లో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఔషధ తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో పేలుళ్లు, రసాయనాల లీకేజీలు, షార్ట్ సర్క్యూ ట్లు, అగ్ని ప్రమాదాలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల మూలంగా కార్మీకుల ప్రాణాలు గాల్లో కలుస్తుండగా, భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది.
పారిశ్రామిక రంగంలో ఫార్మాస్యూటికల్స్, కెమికల్ యూని ట్స్‌ను హైరిస్క్ పరిశ్రమలుగా పరిగణిస్తూ ఉంటారు. తెలంగాణలో హైరిస్క్ యూనిట్లు 4,130 వరకు ఉన్నా వాటిలో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో ఇన్‌స్పెక్టర్లు 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పరిశ్రమల సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను తరచూ తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
రెండు రోజులకో ప్రమాదం..
⇒ రాష్ట్రంలో సగటున ప్రతీ రెండు రోజులకో ప్రమాదం జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో 600కు పైగా పారిశ్రామిక ప్రమాదాలు జరగ్గా 1,116 మరణాలు సంభవించినట్లు సమాచారం. గత పదేళ్లలో ఫార్మా యూనిట్లలో 102 భారీ అగ్ని ప్రమాదాలు జరగ్గా.. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ లెక్కలు చెప్తున్నాయి.
రియాక్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, ముడి సరుకులు, ఉత్పత్తుల నిలువ, రవాణాలో అజాగ్రత్తలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో భారీ యంత్రాల చుట్టూ రక్షణ చర్యలు, పిట్స్, సంప్స్ వద్ద జాగ్రత్తలు, యంత్ర భాగాల తనిఖీలు, పరిశుభద్రత, సరైన గాలి, వెలుతురు, ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవడం. హానికర రసాయనాలను సురక్షితంగ పారవేయడం వంటి వాటిలో నిర్లక్ష్యం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
ఉద్యోగులు, కార్మీకులకు సరైన నైపుణ్య శిక్షణ లేకపోవడం, తక్కువ వేతనాలు ఇచ్చే ఉద్దేశంతో నైపుణ్యం లేని కార్మీకులను విధుల్లోకి తీసుకోవడం, ప్రమాదకర రసాయనాల గురించి వారికి అవగాహన లేకపోవడం, కాలం చెల్లిన యంత్రాలను మార్చకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
నిరంతర ఆడిట్ లేనందునే..
⇒ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు నామమాత్ర తనిఖీలు, నోటీసుల జారీతోనే సరిపెడుతున్నట్లు విమర్శలున్నాయి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలతోపాటు ఫైర్ ఆడిట్స్‌ను ఏటా నిర్వహించాల్సి ఉండగా.. అవి మొక్కుబడిగా సాగుతున్నాయి.
భద్రతా ఆడిట్‌లు, కార్మీకులకు నిరంతర శిక్షణ, పర్యావరణ నియమాలు పాటించడం, సాంకేతికంగా నవీకరణ, అత్యవసర స్పందన కోసం పరిశ్రమల్లో అగ్నిమాపక, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవడం తదితరాలపై దృష్టి పెట్టాలనే డిమాండ్ కార్మీకుల నుంచి వినిపిస్తోంది.