శ్రీధర్‌ బినామీలపై ఏసీబీ ఫోకస్‌..! | ACB focuses on Sridhars benami | Sakshi
Sakshi News home page

శ్రీధర్‌ బినామీలపై ఏసీబీ ఫోకస్‌..!

Jun 25 2025 4:55 AM | Updated on Jun 25 2025 4:55 AM

ACB focuses on Sridhars benami

ఇరిగేషన్‌ బినామీలుగా కొందరి గుర్తింపు  

ఐదో రోజు విచారణలో కీలక వివరాల సేకరణ 

ముగిసిన ఇరిగేషన్‌ ఈఈ ఏసీబీ కస్టడీ  

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్‌ శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. శ్రీధర్‌ తన అక్రమార్జనను బినామీల పేరిట దాచినట్టు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడు వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు అనుమతితో ఈ నెల 20 నుంచి నూనె శ్రీధర్‌ను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణలో పలు కీలక వివరాలు సేకరించారు. 

మంగళవారం చివరి రోజు విచారణలో బినామీల గురించే ఎక్కువసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం ఒక ఎస్‌బీఐ బ్యాంకు లాకర్‌ తెరిపించగా, మంగళవారం మరికొన్ని లాకర్లను తెరిపించారు. అందులో కొన్ని ఆస్తి పత్రాలు గుర్తించారు. ఎవరెవరి పేర్లపై ఈ ఆస్తులు ఉన్నాయి..? వారికి శ్రీధర్‌తో సంబంధాలు ఏంటి..? అన్నది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. 

ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం నూనె శ్రీధర్‌ ఆస్తులు రూ.200 కోట్లకుపైనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. లాకర్లలో పట్టుబడిన డాక్యుమెంట్ల ప్రకారం అది మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీధర్‌ కస్టడీ ముగియటంతో బినామీలకు నోటీసులు జారీచేసిన వారిని సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement