సిట్‌కు చిక్కిన డ్రగ్‌ పెడ్లర్‌ | Abhishek Singh in police custody | Sakshi
Sakshi News home page

సిట్‌కు చిక్కిన డ్రగ్‌ పెడ్లర్‌

Mar 22 2026 5:37 AM | Updated on Mar 22 2026 5:37 AM

Abhishek Singh in police custody

పోలీసుల అదుపులో అభిషేక్‌సింగ్‌ 

రోహిత్‌రెడ్డి డ్రైవర్‌కు మత్తు పదార్థాలు విక్రయించిన నిందితుడు 

24 సార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం 

మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో కొనసాగుతున్న పోలీస్‌ పహారా 

మొయినాబాద్, శంషాబాద్‌ రూరల్‌: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు సిట్‌ అధికారులకు చిక్కాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రైవర్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, డ్రగ్‌ పెడ్లర్‌ అభిషేక్‌సింగ్‌ను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కోసం డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేలింది. ఇతని ద్వారా డ్రగ్స్‌ మూలాలను గుర్తించడంపై సిట్‌ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్‌ నుంచి రోహిత్‌రెడ్డి బృందం సుమారు 24 సార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం.  

లింక్‌లపై ఆరా.. 
అభిషేక్‌సింగ్‌ పోలీసులకు చిక్కడంతో అతని నుంచి డ్రగ్స్‌ ఎవరెవరు, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారనే కోణంలో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇతనితో కొనుగోలుదారులు జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ చాటింగ్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేయగా.. రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ జైలుకు వెళ్లారు. మిగతా వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురికి బెయిల్‌ మంజూరైంది. 

మహేశ్‌కుమార్‌ మినహా.. మిగిలిన వారంతా ఐదు రోజులుగా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిట్‌ విచారణకు హాజరవుతున్నారు. కేసు దర్యాప్తుపై ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సు«దీర్‌బాబు ఎప్పటికప్పుడు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆయన నిందితులను నేరుగా విచారించి పలు విషయాలు తెలుసుకుంటున్నారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో పురోగతి సాధించవచ్చని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉందని చెపుతున్నారు. 

పోలీస్‌ పహారాలో ఫామ్‌హౌస్‌.. 
వివాదాలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో పోలీస్‌ పహారా కొనసాగుతోంది. ఈ నెల 14న ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసేందుకు ఈగల్‌ టీం, స్థానిక పోలీసులు వెళ్లడంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు సిట్‌ ఏర్పాటు చేసింది. పార్టీలో పాల్గొన్న నిందితులకు చెందిన ఆరు లగ్జరీ కార్లు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నాయి. 

ఆ రోజు నుంచి పోలీసులు ఫామ్‌హౌస్‌లో పహారా కాస్తూ.. బయటి వ్యక్తులను లోనికి రానివ్వడంలేదు. మరోవైపు అసైన్డ్‌ భూమిలో ఉన్న ఫామ్‌హౌస్‌ను సీజ్‌ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూ రికార్డులను పరిశీలించిన అధికారులు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అనుమతులు లేకుండా రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement