మరో జన్మ ఎత్తాం.. మళ్లీ జైలుకెళ్లం
రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షపై విడుదల చేసిన 91 మంది ఖైదీల మనోగతం
కొత్త జీవితం ప్రారంభించాలని ఆకాంక్షించిన జైళ్ల శాఖ డైరెక్టర్ సౌమ్యా మిశ్రా
జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు
కుషాయిగూడ/మల్లాపూర్/కాప్రా: ‘క్షణికావేశంలో తప్పు చేశాం. జైలు జీవితం చాలా పాఠాలు నేర్పింది. కుటుంబం విలువ తెలిసొచ్చింది. ఇది మాకు మరో జన్మ. ఇంకెప్పుడూ జైలు, పోలీసు స్టేషన్ వైపు కూడా వెళ్లం. ఊళ్లలో పనిచేసుకుంటూ బతుకుతాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో మంగళవారం విడుదలైన 91 మంది (85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు) యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ముక్తకంఠంతో చెప్పారు.
కొత్త జీవితం ప్రారంభించండి: సౌమ్యా మిశ్రా
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ విడుదలైన ఖైదీలంతా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా జీవించాలని హితవు పలికారు. అప్పుడే తమ శ్రమకు ఫలితం లభిస్తుందన్నారు. విడుదలైన వారిలో 38 మందికి జైళ్లశాఖ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
జైళ్ల శాఖ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చి నలుగురు మహిళా ఖైదీలకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన కుట్టు మిషన్లు అందించారు. మిగతా ఖైదీలు జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యంతో వ్యవసాయం, వ్యాపారాలు నిర్వహించుకొని ఉపాధి పొందుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీలు వై. రాజేశ్, ఎన్. మురళీబాబు, డీఐజీలు డి. శ్రీనివాస్, ఎం. సంపత్, జైళ్ల పర్యవేక్షణాధికారులు శివకుమార్‌గౌడ్, కళాసాగర్, సంతోశ్‌కుమార్ రాయ్, ఎస్పీడబ్ల్యూ పర్యవేక్షణాధికారి వెంకటలక్ష్మి, శ్రీనాథ్, ప్రమోద్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ జైలు వైపు కూడా వెళ్లను
భార్య హత్య కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు విడుదలవుతు న్నా. మళ్లీ జైలు వైపుగానీ, పోలీస్ స్టేషన్ వైపుగానీ వెళ్లనని నా మనస్సాక్షి మీద ఒట్టు వేసుకున్నా. – పరశురాం, మహబూబ్‌నగర్ జిల్లా
ఇది నాకు మరో జన్మ
స్నేహితుల మధ్య గొడవ సందర్భంగా జరిగిన హత్య కేసులో 17 ఏళ్లపాటు జైలు జీవితం గడిపా. మళ్లీ ఇంటికి వెళ్తానని అనుకోలేదు. ఇది నాకు మరో జన్మ. ఇకపై అందరితో సోదరభావంతో మెలుగుతా. ఊళ్లో పనిచేసుకుంటూ జీవిస్తా. – పురుషోత్తమ్, నిజామాబాద్
కుటుంబం విలువ తెలిసింది..
క్షణికావేశంలో హత్య చేశా. చంచల్‌గూడలో 13 ఏళ్లు శిక్ష అనుభవించాక కుటుంబం విలువ ఏమిటో తెలిసొచ్చింది. జైల్లో ఉన్నన్ని రోజులూ కొడుకును తలుచుకొని ఏడిచా. క్షణికావేశంలో తప్పు చేసి ఎవరూ జైలుపాలు కావద్దు. ఇంటికి వెళ్లాక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తా. – సంతోష్, నిర్మల్ జిల్లా
జైలు జీవితం చాలా పాఠాలు నేర్పింది
భార్య ఆత్మహత్య కేసులో ఏడాదిపాటు మహబూబ్‌నగర్‌లో జైల్లో, ఆ తర్వాత చర్లపల్లిలో 11 ఏళ్లు గడిపా. జైలు జీవితం ఎన్నో పాఠాలు నేల్పిది. సత్ప్రవర్తన కలిగి ఉండటంతో విడుదలవుతున్నా. – వెంకటేశ్ కర్నూలు, ఏపీ


