Release prisoners
-
జైలు నేర్పింది.. జీవిత పాఠం..
కుషాయిగూడ/మల్లాపూర్/కాప్రా: ‘క్షణికావేశంలో తప్పు చేశాం. జైలు జీవితం చాలా పాఠాలు నేర్పింది. కుటుంబం విలువ తెలిసొచ్చింది. ఇది మాకు మరో జన్మ. ఇంకెప్పుడూ జైలు, పోలీసు స్టేషన్ వైపు కూడా వెళ్లం. ఊళ్లలో పనిచేసుకుంటూ బతుకుతాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో మంగళవారం విడుదలైన 91 మంది (85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు) యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ముక్తకంఠంతో చెప్పారు. కొత్త జీవితం ప్రారంభించండి: సౌమ్యా మిశ్రా ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ విడుదలైన ఖైదీలంతా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా జీవించాలని హితవు పలికారు. అప్పుడే తమ శ్రమకు ఫలితం లభిస్తుందన్నారు. విడుదలైన వారిలో 38 మందికి జైళ్లశాఖ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. జైళ్ల శాఖ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చి నలుగురు మహిళా ఖైదీలకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన కుట్టు మిషన్లు అందించారు. మిగతా ఖైదీలు జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యంతో వ్యవసాయం, వ్యాపారాలు నిర్వహించుకొని ఉపాధి పొందుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీలు వై. రాజేశ్, ఎన్. మురళీబాబు, డీఐజీలు డి. శ్రీనివాస్, ఎం. సంపత్, జైళ్ల పర్యవేక్షణాధికారులు శివకుమార్‌గౌడ్, కళాసాగర్, సంతోశ్‌కుమార్ రాయ్, ఎస్పీడబ్ల్యూ పర్యవేక్షణాధికారి వెంకటలక్ష్మి, శ్రీనాథ్, ప్రమోద్, భరత్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జైలు వైపు కూడా వెళ్లను భార్య హత్య కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు విడుదలవుతు న్నా. మళ్లీ జైలు వైపుగానీ, పోలీస్ స్టేషన్ వైపుగానీ వెళ్లనని నా మనస్సాక్షి మీద ఒట్టు వేసుకున్నా. – పరశురాం, మహబూబ్‌నగర్ జిల్లాఇది నాకు మరో జన్మ స్నేహితుల మధ్య గొడవ సందర్భంగా జరిగిన హత్య కేసులో 17 ఏళ్లపాటు జైలు జీవితం గడిపా. మళ్లీ ఇంటికి వెళ్తానని అనుకోలేదు. ఇది నాకు మరో జన్మ. ఇకపై అందరితో సోదరభావంతో మెలుగుతా. ఊళ్లో పనిచేసుకుంటూ జీవిస్తా. – పురుషోత్తమ్, నిజామాబాద్కుటుంబం విలువ తెలిసింది.. క్షణికావేశంలో హత్య చేశా. చంచల్‌గూడలో 13 ఏళ్లు శిక్ష అనుభవించాక కుటుంబం విలువ ఏమిటో తెలిసొచ్చింది. జైల్లో ఉన్నన్ని రోజులూ కొడుకును తలుచుకొని ఏడిచా. క్షణికావేశంలో తప్పు చేసి ఎవరూ జైలుపాలు కావద్దు. ఇంటికి వెళ్లాక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తా. – సంతోష్, నిర్మల్ జిల్లా జైలు జీవితం చాలా పాఠాలు నేర్పింది భార్య ఆత్మహత్య కేసులో ఏడాదిపాటు మహబూబ్‌నగర్‌లో జైల్లో, ఆ తర్వాత చర్లపల్లిలో 11 ఏళ్లు గడిపా. జైలు జీవితం ఎన్నో పాఠాలు నేల్పిది. సత్ప్రవర్తన కలిగి ఉండటంతో విడుదలవుతున్నా. – వెంకటేశ్ కర్నూలు, ఏపీ -
జీవిత ఖైదీలకు విముక్తి
ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: జీవిత ఖైదీలు, వారి కుటుంబాల్లో ఆనందం పెల్లుబికింది. ఎన్నో ఏళ్లుగా తమవారి కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను శనివారం రాత్రి స్థానిక దానవాయిగూడెంలోని జిల్లా జైలు నుంచి విడుదల చేశారు. వాస్తవానికి గాంధీ జయంతి సందర్భంగా వీరిని విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. తిరిగి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో 11 మంది జీవిత ఖైదీలకు విముక్తి కల్పించారు. వీరంతా పలు హత్యకేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ‘ఏదో తెలిసీ తెలియక తప్పు చేశాం.. దానికి శిక్ష అనుభవించాం..ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుంటాం..చీకటి జీవితానికి తెరపడినందుకు ఆనందంగా ఉంది.’ అని జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలు ఆనందభాష్పాలు రాల్చారు. ఖైదీలు జైలు నుంచి బయటకు రాగానే వారి కుటుంబసభ్యులు ఆప్యాయంగా వెళ్లి హత్తుకున్నారు. జైలు నుంచి విడుదలైన వారిలో... కొణిజర్ల మండలం బస్వాపురానికి చెందిన పాలకుర్తి రాఘవులు, చల్లా సీతారాములు, బోనకల్ మండలం రావినూతల వాసి మిరియాల నాగేశ్వరరావు, మిరియాల కృష్ణ, మిరియాల సత్యం, కొణిజర్ల మండలం డాక్టర్ బజార్‌కు చెందిన తుళ్లూరి వెంకటయ్య, టేకులపల్లి మండలం రాళ్లపాడుకు చెందిన పాయం నర్సయ్య, ఖమ్మం అర్బన్ మండలం బురదరాఘవాపురానికి చెందిన బల్లు సీతారామారావు, పాల్వంచ మండలం గాంధీనగర్ వాసి గార్లపాటి కృష్ణ, భద్రాచలం మండలం బాసువాగు గ్రామానికి చెందిన ఏర్పుల అబ్రహం, ఏన్కూరు మండలం తోటలింగన్నపేట చెందిన పున్నెపు ఉపేందర్ జైలు నుంచి విడుదలైన వారిలో ఉన్నారు. పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం: పదేళ్లుగా జైలులోనే ఉన్నా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశా. ఈ రోజు నా కల ఫలించడంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించినందుకు సంతోషంగా ఉంది. - ఏర్పుల అబ్రహ ం, భద్రాచలం జీవితంలో తిరిగి తప్పు చేయను: తెలిసో తెలియకో తప్పుచేసి జైలుకు వచ్చా. జీవితంలో మళ్లీ ఎలాంటి తప్పు చేయను. చేసిన తప్పుకు ఈ పదేళ్లు కుమిలిపోయా. బయటకు వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి హాయిగా జీవిస్తా. ఎదైనా పనిచేసుకుని బతుకుతా. - గార్లపాటి కృష్ణ, పాల్వంచ జైలు జీవితం నరకం: జైలు జీవితం నరకం. పదేళ్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నా. తొందరపడి తప్పు చేసి..జైలు పాలుకావద్దు. ఏ వివాదాల జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసుకుంటా. అందరితో సంతోషంగా మెలుగుతా. - మిరియాల సత్యం, రావినూతల ఆనందంగా ఉంది: జైలు నుంచి విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. జైలులో పదేళ్లు మానసికక్షోభ అనుభవించా. భార్యా పిల్లలకు దూరంగా ఉండటం నన్ను ఎంతో బాధించింది. బతికుండగా ఏ తప్పూ చేయను. - పాయం నర్సయ్య, టేకులపల్లి


