జీవిత ఖైదీలకు విముక్తి | Release prisoners in khammam district | Sakshi
Sakshi News home page

జీవిత ఖైదీలకు విముక్తి

Dec 22 2013 3:56 AM | Updated on Sep 2 2017 1:50 AM

జీవిత ఖైదీలు, వారి కుటుంబాల్లో ఆనందం పెల్లుబికింది. ఎన్నో ఏళ్లుగా తమవారి కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరింది.

ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: జీవిత ఖైదీలు, వారి కుటుంబాల్లో ఆనందం పెల్లుబికింది. ఎన్నో ఏళ్లుగా తమవారి కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను శనివారం రాత్రి స్థానిక దానవాయిగూడెంలోని జిల్లా జైలు నుంచి విడుదల చేశారు. వాస్తవానికి గాంధీ జయంతి సందర్భంగా వీరిని విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. తిరిగి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో 11 మంది జీవిత ఖైదీలకు విముక్తి కల్పించారు. వీరంతా పలు హత్యకేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ‘ఏదో తెలిసీ తెలియక తప్పు చేశాం.. దానికి శిక్ష అనుభవించాం..ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుంటాం..చీకటి జీవితానికి తెరపడినందుకు ఆనందంగా ఉంది.’ అని జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలు ఆనందభాష్పాలు రాల్చారు. ఖైదీలు జైలు నుంచి బయటకు రాగానే వారి కుటుంబసభ్యులు ఆప్యాయంగా వెళ్లి హత్తుకున్నారు.
 
 జైలు నుంచి విడుదలైన వారిలో...
 కొణిజర్ల మండలం బస్వాపురానికి చెందిన పాలకుర్తి రాఘవులు, చల్లా సీతారాములు, బోనకల్ మండలం రావినూతల వాసి మిరియాల నాగేశ్వరరావు, మిరియాల కృష్ణ, మిరియాల సత్యం, కొణిజర్ల మండలం డాక్టర్ బజార్‌కు చెందిన తుళ్లూరి వెంకటయ్య, టేకులపల్లి మండలం రాళ్లపాడుకు చెందిన పాయం నర్సయ్య, ఖమ్మం అర్బన్ మండలం బురదరాఘవాపురానికి చెందిన బల్లు సీతారామారావు, పాల్వంచ మండలం గాంధీనగర్ వాసి గార్లపాటి కృష్ణ, భద్రాచలం మండలం బాసువాగు గ్రామానికి చెందిన ఏర్పుల అబ్రహం, ఏన్కూరు మండలం తోటలింగన్నపేట చెందిన పున్నెపు ఉపేందర్ జైలు నుంచి విడుదలైన వారిలో ఉన్నారు.
 
 పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం: పదేళ్లుగా జైలులోనే ఉన్నా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశా. ఈ రోజు నా కల ఫలించడంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించినందుకు సంతోషంగా ఉంది.
 - ఏర్పుల అబ్రహ ం, భద్రాచలం
 
 జీవితంలో తిరిగి తప్పు చేయను: తెలిసో తెలియకో తప్పుచేసి జైలుకు వచ్చా. జీవితంలో మళ్లీ ఎలాంటి తప్పు చేయను. చేసిన తప్పుకు ఈ పదేళ్లు కుమిలిపోయా. బయటకు వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి హాయిగా జీవిస్తా. ఎదైనా పనిచేసుకుని బతుకుతా.
 - గార్లపాటి కృష్ణ, పాల్వంచ
 
 జైలు జీవితం నరకం: జైలు జీవితం నరకం. పదేళ్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నా. తొందరపడి తప్పు చేసి..జైలు పాలుకావద్దు. ఏ వివాదాల జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసుకుంటా. అందరితో సంతోషంగా మెలుగుతా.
 - మిరియాల సత్యం, రావినూతల
 
 ఆనందంగా ఉంది: జైలు నుంచి విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. జైలులో పదేళ్లు మానసికక్షోభ అనుభవించా. భార్యా పిల్లలకు దూరంగా ఉండటం నన్ను ఎంతో బాధించింది. బతికుండగా ఏ తప్పూ చేయను.  
 - పాయం నర్సయ్య, టేకులపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement