MBBS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్‌ | 85 Percent Category B Medical Seats For Local Students In Telangana | Sakshi
Sakshi News home page

MBBS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్‌

Nov 28 2022 1:27 AM | Updated on Nov 28 2022 7:55 AM

85 Percent Category B Medical Seats For Local Students In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లలో 85 శాతం కోటా రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వడంతో నీట్‌లో పొందిన మార్కుల కటాఫ్‌ తగ్గినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కంటే కటాఫ్‌ తగ్గడం వల్ల, ఈసారి కొత్తగా వెయ్యి మంది రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. గతేడాది ఒక ప్రైవేట్‌ కాలేజీలో చివరి బీ కేటగిరీ సీటు 399 మార్కుల వరకు కటాఫ్‌ వచ్చిన విద్యార్థికి వచ్చింది.

ఇప్పుడు ఇంకా రెండు దశలున్నప్పటికీ మొదటి విడత బీ కేటగిరీ సీట్లలో ఒక ప్రైవేట్‌ కాలేజీలో 309 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చిందని వర్సిటీ వర్గాలు చెప్పాయి. గతేడాది చివరి కౌన్సెలింగ్‌ నాటి పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు మొదటి విడత సీట్ల భర్తీలోనే కటాఫ్‌ తగ్గిందన్నా­యి. ఈసారి 290 మార్కులొ­చ్చిన వారికీ బీ కేటగిరీలో సీటు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

287 మార్కులొచ్చిన ముస్లిం విద్యార్థినికి మైనారిటీ కాలేజీలో బీ కేటగిరీలో సీటు వచ్చింది. ముస్లిం విద్యార్థులకు కూడా తాజా రిజర్వేషన్ల వల్ల న్యాయం జరిగిందని చెబుతున్నారు. గతేడాది 6,500 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఈసారి రెండు వేల వరకు మాత్రమే వచ్చినట్లు అంచనా.  

ఇతర రాష్ట్రాలకు తగ్గిన వలసలు 
ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో బీ కేటగిరీలోని 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల అడ్మిషన్ల నిబంధనలు సవరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభిస్తున్నాయి. రాష్ట్రంలో 20 నాన్‌ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 1,120 సీట్లు ఉన్నాయి.

ఇప్పటివరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బీ కేటగిరీలోని 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్ల(168)కు మాత్రమే ఓపెన్‌ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్‌ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అలాగే 4 మైనార్టీ కాలేజీల్లో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి.

తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి వారికే దక్కుతున్నాయి. ఇప్పటివరకు లోకల్‌ కోటా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో చేరేవారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగేది. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడి విద్యార్థులకు సీటు రావడంతోపాటు తక్కువ మార్కులొచ్చిన వారూ సీట్లు పొందే వెసులుబాటు వచ్చింది.

మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఓపెన్‌ కోటా విధానమే లేదు. గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మన విద్యార్థులు అక్కడ కూడా సీటు పొందే అర్హత ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్థానిక కోటా తేవడంతో పరిస్థితి మారిందని తెలంగాణ ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ సీట్ల స్థానిక సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్‌ పేర్కొన్నారు. కటాఫ్‌ కూడా మారిందన్నారు.  

కటాఫ్‌ తగ్గుతుంది
బీ కేటగిరీ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్‌ కల్పించడం వల్ల కటాఫ్‌ మార్కులు గతంతో పోలిస్తే తగ్గుతున్న మాట వాస్తవమే. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చాలా తక్కువగా దరఖాస్తు చేయడంవల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు బీ కేటగిరీ సీట్లకు ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్‌ ఉన్నందున ఎంతమేరకు కటాఫ్‌ తగ్గే అవకాశాలున్నాయో ఇంకా స్పష్టత రాలేదు.  
– డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement