
అట్టహాసంగా మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగల సత్తా ఉందని తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. 72వ మిస్ వరల్డ్ అందాల పోటీల నిర్వహణ అవకాశాన్ని అనూహ్యంగా దక్కించుకోవడమే కాకుండా అట్టహాసంగా నిర్వహించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మే 2 నుంచి నిర్వాహకులు, పోటీదారులు నగరానికి చేరుకోవడం మొదలు శనివారం హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లోపాలు లేకుండా మిస్ వరల్డ్ సంస్థతో కలిసి పోటీలను సంయుక్తంగా నిర్వహించింది. పోటీల నిర్వహణలో ఆద్యంతం తెలంగాణ సాంస్కృతిక కళా వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసింది. పోటీల నిర్వహణకు రూ. 60 కోట్ల వరకు ఖర్చవగా ప్రపంచ సుందరీమణులు పర్యటించిన ప్రాంతాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల సుందరీకరణకు మరో రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేసింది.
పర్యాటకానికి ఊతం..
జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంతో మిస్ వరల్డ్–2025 పోటీలు మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక్కో స్థానిక సంప్రదాయ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఒక్కో ఖండానికి చెందిన పోటీదారులను పరిచయం చేయడం వీక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాన్ని తెలియజెప్పేందుకు పోటీదారులతో ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రపంచ దేశాల సుందరీమణులకు ఎంతగానో నచ్చింది. పోటీల ఇతివృత్త నినాదమైన ‘తెలంగాణ జరూర్ ఆనా’ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇవన్నీ తెలంగాణ పర్యాటకానికి ఊతమిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ముసిరిన వివాదం..
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ మే 16న అందాల పోటీ నుంచి తప్పుకోవ డం వివాదానికి దారితీసింది. మిస్ వరల్డ్ నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం.. ము గ్గురు సీనియర్ మహిళా ఐపీఎస్‌లతో విచారణకు ఆదేశించింది. అయితే మి ల్లా మాగీ నిరాధార ఆరోపణలు చేసిందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లీ స్పష్టం చేశారు. పోటీ ల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా సహకరించిందని.. తదుపరి పోటీలను కూడా అవకాశం లభిస్తే హై దరాబాద్‌లోనే నిర్వహించాలని ఉందని ఆమె పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.