అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

70 Percent Students Gets Visas Says Hyderabad US Consulate - Sakshi

దరఖాస్తు చేసుకున్నవారిలో వీలైనంత మందికి ఇస్తున్నాం

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌

కరోనా నియంత్రణలోకి వచ్చాక మళ్లీ వీసాలకు డిమాండ్‌ పెరిగింది

వై–యాక్సిస్‌లో కొత్తగా ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్‌’ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: అర్హులైన ప్రతి విద్యార్థికి వీసా జారీ చేసేందుకు కట్టుబడి పనిచేస్తున్నామని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో మూడొంతుల మందికి వీసాలు జారీ చేశామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల గతేడాది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగిందని.. విద్యార్థులు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తిరిగి వీసాల జారీ ప్రక్రియను పునరుద్ధరించాక హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ లో స్టూడెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లకు భారీగా డిమాండ్‌  పెరిగిందన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌లో శుక్రవారం ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్‌’ను జోయెల్‌ రీఫ్‌మన్‌ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

విద్యార్థులు సకాలంలో క్యాంపస్‌లలో చేరేందుకు వీలుగా స్టూడెంట్‌ వీసాల జారీకి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధాల్లో విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియ వెన్నెముక లాంటిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులేనని చెప్పారు. ప్రస్తుతం యూఎస్‌లో 1,93,124 మంది భారత విద్యార్థులు ఉండగా.. అందులో 85 వేల మంది గ్రాడ్యుయేట్, 25 వేల మంది అండర్‌ గ్రాడ్యుయేట్, 81 వేల మంది ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) చేస్తున్నారని వివరించారు. భారత్‌లోని ఇతర ప్రాంతాలతో పోల్చితే.. ఏపీ, తెలంగాణ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌కు వస్తున్నారని చెప్పారు. ప్రతి నాలుగు తెలుగు కుటుంబాల్లో ఒకదానికి యూఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు. మరింత మంది భారత విద్యార్థులకు వీసాలు జారీ చేయడం కోసం వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు.

తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల విద్యార్థులకు ఈ కేంద్రంలోని నిపుణులైన సలహాదారులు అమెరికాలో ఉన్న విద్యా అవకాశాలపై ఉచిత సలహాలు ఇస్తారని వివరించారు. భారతదేశంలో ఇది 8వ ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్‌ అని చెప్పారు. యూఎస్‌లో 4000కు పైగా కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ భవనంలో 54 వీసా ఇంటర్వూ్య విండోలు ఉన్నాయని.. ఎక్కువ మందికి వీసా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి సదుపాయాలు మెరుగుపర్చామని చెప్పారు. కాగా.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లోని వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌లో ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలోని ఉన్నత విద్యా అవకాశాలపై పుస్తకాలు, మ్యాగజైన్‌లు, డీవీడీలను అందుబాటులో ఉంచారు.

లాభాపేక్ష లేకుండా సలహాలు
ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ సెంటర్‌లో విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం చేస్తామని వై-యాక్సిస్‌ వ్యవస్థాపకుడు జేవియర్‌ అగస్టిన్‌ వెల్లడించారు. సలహాల కోసం ప్రైవేటు ఏజెంట్ల దగ్గరికి వెళ్తే.. వారికి కమీషన్లు ఇచ్చే వర్సిటీలు, కళాశాలలకు పంపుతారన్నారు. తమ సంస్థ అలాంటి అనైతిక పనులు చేయదని, కేవలం విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, వారి ఆసక్తి ఆధారంగా మాత్రమే సలహాలు ఇస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీ పబ్లిక్‌ అఫైర్‌ మినిస్టర్‌ కౌన్సిలర్‌ డెవిడ్‌ కెన్నడీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top