ప్రభుత్వ కళాశాలల్లో 3,284.. ప్రైవేట్‌లో 2,635
కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ల కేటాయింపు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కేటాయింపు ఖరారైంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన సీట్ల పట్టిక ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి 5,919 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,284, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2,635 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయతోపాటు జి ల్లాల్లోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయించారు.
సాధారణ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ వర్గాలకు బాలు రు, బాలికలకు ప్రత్యేకంగా సీట్లు చూపించారు. దివ్యాంగులు, సీఏపీ, ఇతర ప్రత్యేక కేటగిరీలను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2,268 సీట్లు నాన్ మైనారిటీ, మహిళా కళాశాలల విభాగంలో ఉండగా.. మైనారిటీ కళాశాలల్లో మరో 367 సీట్లు ఉన్నాయి. డెక్కన్, షాదన్, ఆయాన్ తదితర మైనారిటీ కళాశాలలకు ప్రత్యేక సీట్ల పట్టికను రూపొందించారు. వీఆర్‌కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీల్లో మహిళలకు ప్రత్యేకంగా సీట్లు ఉన్నాయి. అదనంగా ప్రభుత్వంలోని ఏడు వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 102 సీట్లను ప్రత్యేకంగా చూపించారు. ఈ సీట్ల ఆధారంగానే ఎంబీబీఎస్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు జరగనుంది. కాంపిటెంట్ అథారిటీ కోటా ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన తాజా మెరిట్ జాబితాను కూడా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.


