మరో చరిత్రకు ముందడుగు

5,000 students engaged in unearthing the history of villages - Sakshi

పల్లెల ప్రస్థానం,చారిత్రక నేపథ్యంపై అక్షర యజ్ఞం 

‘మన ఊరి చరిత్రను మనమేతెలుసుకుందాం’తో కొత్త శకం 

బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీకారం

12,769గ్రామాల చరిత్ర వెలికితీసే పనిలో 5,000 మంది విద్యార్థులు 

వాళ్లంతా నల్లగొండ జిల్లా చిలుకూరు విద్యార్థులు. కోదాడ కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. తమ ఊరి చరిత్రను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇటీవల గ్రామపెద్దలను కలిశారు. ఇక్కడ 1969లో ప్రారంభమైన గ్రంథాలయం ప్రజల్లో తెచ్చిన చైతన్యం గురించి తెలుసుకున్నారు. అదే ఊళ్లోని కాకతీయుల కాలం నాటి కోదాడ రామాలయ నిర్మాణం తీరును పరిశీలించారు. అందులోని కోనేరులో ఆలయ అవసరాలతోపాటు వ్యవసాయం కోసం నిర్మించిన మోట బావి విశేషంగా ఉంది. ఈ కోనేరు ప్రత్యేకతను విద్యార్థులు పట్టుకోగలిగారు. చెన్నకేశవాలయంలో పురాతన శాసనం ఒకటి ఉంది. పాత చారిత్రక గ్రంథాలను తీసి పరిశోధించాల్సి ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. 

సాక్షి, సిటీడెస్క్‌ : ‘చరిత్ర మరిచిన మనిషి పూడ్చిపెట్టిన శవం లాంటి వాడు’.. వర్తమానం నుంచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు చరిత్ర ఎంతగానో దోహదపడుతుంది. సమాజ పురోగమనానికి బాటలు వేస్తుంది. రాతలు, శాసనాలు, కట్టడాలు, పురాతన ఆధారాల స్వరూపమే చరిత్ర.

ఇప్పటివరకు తెలియని, ప్రాచుర్యంలోకి రాని ఘట్టాలను తెలుసుకునే అన్వేషణలో భాగంగానే తెలంగాణ రాష్ట్రావిర్భావం అనంతరం ప్రస్తుతం మొదలైంది. ఓ యజ్ఞంలా ముందుకు సాగుతోంది. అటువంటి ఆలోచనే ‘మన ఊరి చరిత్రను మనమే తెలుసుకుందాం’ప్రాజెక్టు సర్వే. దీని ద్వారా మరుగునపడ్డ గత కాలపు వైభవాలు, జ్ఞాపకాలు, విశిష్టత, చారిత్రక నేపథ్యం బయటపడుతున్నాయి. ఆ బాధ్యతను ఇప్పటికే భుజానికెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ విశేషాలపై ప్రత్యేక కథనం. 

ఇండియన్‌ విలేజ్‌.. ఓ ప్రేరణ 
చారిత్రక అన్వేషణకు స్ఫూర్తి నింపింది ఇండియన్‌ విలేజ్‌ పుస్తకం. 1950–51లో అప్పటి ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌ దూబే 15 మంది విద్యార్థులతో శామీర్‌పేటలో పర్యటించి అక్కడి సామాజిక అంశాలపై ‘ఇండియన్‌ విలేజ్‌’పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆ గ్రంథమే నేటికీ సామాజిక శాస్త్రాలకు, గ్రామీణ ప్రాంతాలపై పరిశోధనకు కొలమానంగా నిలిచింది. దీని ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ సాహిత్య అకాడమీ పల్లె బాట పట్టింది.

గ్రామ చరిత్రల నిర్మాణానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఓ ప్రశ్నావళి రూపొందించింది. దీనికి అనుగుణంగా గ్రామ నైసర్గిక స్వరూపం, ఎప్పుడు ఏర్పడింది? కాలానుగుణ మార్పు లు, ఊరికి పేరురావడానికి ప్రత్యేక కారణాలు న్నాయా? అలనాటి అవశేషాలు, సామాజిక వర్గాల జీవనం ఎలా తదితర వివరాలు సేకరిస్తున్నారు.  

సర్వే ఎవరు చేస్తున్నారు? 
రాష్ట్రంలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న అయిదువేల మందికి పైగా విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ నల్లగొండలోని నాగార్జున కళాశాల వేదికగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాల్లో చరిత్ర మూలాల కోసం శోధన జరుగుతోంది.

క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామపెద్దలు, వయోవృద్ధులు, గ్రామ పురోహితులు, స్వాతంత్య్ర సమరయోధులు, రెవెన్యూ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కవులు, రచయితలు, సామాజికవేత్తలు, మేధావులతో జూలూరిఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

అద్భుతమైన ఉద్యమం 
విద్యార్థులు తమ ఊరు చరిత్ర తామే రాయడం ఓ మధురానుభూతి. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు తెలంగాణ పల్లెల ప్రస్థానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ఈ పరిశోధనకు సంబంధించి ఓ పుస్తకాన్ని తెచ్చేందుకు సమాయత్తమవుతున్నాం. పల్లెల్లోని మట్టి మూలాలను జల్లెడ పట్టి ప్రపంచానికి పరిచయం చేసేందుకు శరవేగంగా అక్షర యాత్ర సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర సాహిత్య అకాడమీ పూనుకోని అద్భుతమైన ఉద్యమానికి మేము తెరలేపాం. భావితరాలకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఈ ప్రాజెక్టు సక్సెస్‌కు కళాశాల విద్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.  –జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ 

ఆనందంగా ఉంది  
పూర్వం బూరుగడ్డ గ్రామాన్ని శాల్మిల కందపురంగా పిలిచేవారు. శాల్మిల కంద అనగా భృగు చెట్టు. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఈ గ్రామానికి భృగు గడ్డ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా బూరుగడ్డగా మారింది. ఇక్కడి శాల్మిల కందలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి ఆలయాన్ని 1172లో నిర్మించారు. దీని గర్భగుడిలో ఒకే పీఠంపై వరాహస్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, వేణుగోపాల స్వామి కొలువై ఉండటం ప్రత్యేకత. – విష్ణు, డిగ్రీ ఫైనల్‌ ఇయర్, కోదాడ 

ఇదో గొప్ప అవకాశం 
‘మన ఊరు చరిత్ర మనమే తెలుసుకుందాం’లో భాగంగా ప్రాజెక్ట్‌ సూర్యాపేట జిల్లా సమన్వయకర్తగా ఉన్నాను. మా కాలేజీలోని ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ఊరి చరిత్రను తెలుసుకోవడంలో భాగస్వాములయ్యారు. గ్రా మాల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పోరాట చరిత్రను వెలికితేసే క్రమంలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.  –డా. నిర్మల కుమారి, ప్రాజెక్ట్‌ జిల్లా కోఆర్డినేటర్, కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోదాడ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top