నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం | 50 Acres useless For Leather Parks In Telangana: | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

Nov 28 2024 9:59 AM | Updated on Nov 28 2024 9:59 AM

50 Acres useless For Leather Parks In Telangana:

పోలేపల్లి శివారులో శిథిలావస్థకు చేరిన లెదర్‌పార్కు భవనం

జడ్చర్ల: లక్ష మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం లెదర్‌ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. చర్మ ఉత్పత్తుల పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్‌) వీటిని ఏర్పాటు చేయాల్సిన ఉంది. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌ సమీపంలో 2002 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మినీ లెదర్‌ పార్కు నిర్మించాలన్న ఉద్దేశంతో లిడ్‌ క్యాప్‌కు 25 ఎకరాల అసైన్డ్‌ భూమిని, బల్మూర్‌ మండలం జినుకుంటలో 25 ఎకరాలను కేటాయించింది.

ఇందులో భాగంగానే 2004లో అప్పటి ప్రభుత్వం చర్మకారుల అభివృద్ధి కోసం జినుకుంటతోపాటు పోలేపల్లి శివారులో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన స్థలంలో నిధులు వెచ్చించి భవనాలు కూడా నిర్మించింది.

పోలేపల్లి శివారులో గల భూమిలో దాదాపు రూ.10 లక్షల అంచనా వ్యయంతో ఓ భవనాన్ని నిర్మించి మలుపు పేరుతో ఓ పథకాన్ని కూడా ప్రారంభించారు. జినుకుంటలో రూ.25 లక్షలు వెచ్చించి భవనాన్ని నిర్మించి.. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో చర్మ ఉత్పత్తులకు సంబంధించిన యంత్ర సామగ్రిని కూడా సమకూర్చారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పథక ఉద్దేశం నెరవేరడం లేదు. పోలేపల్లిలో కూడా ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన 25 ఎకరాల భూమి నిరుపయోగంగా మారింది.

చెన్నైలో ప్రత్యేక శిక్షణ.. 
చర్మ ఉత్పత్తుల తయారీకి సంబంధించి అప్పట్లో పలువురు నిరుద్యోగ దళిత యువకులను గుర్తించి వారికి చెన్నైలో శిక్షణ ఇప్పించారు. వారి ద్వారా జడ్చర ఇండ్రస్టియల్‌ పార్కులో 250 మందికి చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో నెలకు రూ.1,500 స్టైఫండ్‌ చెల్లించి శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందించారు. లెదర్‌ పార్కులలో ఏర్పాటయ్యే పలు పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చారు. జినుకుంటలో దాదాపు 400 మందికి శిక్షణ ఇచ్చారు. తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేదు.

శిథిలావస్థకు చేరిన భవనాలు 
పోలేపల్లిలో చర్మకారుల వృత్తికి సంబంధించి పాదరక్షలు, పర్సులు, బూట్లు తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మలుపు పథకం భవనం కూడా క్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. భవనాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కిటికీలు, తలుపులు, షట్టర్‌ తదితర సామగ్రిని సైతం దొంగలు అపహరించుకెళ్లారు. జినుకుంటలో సైతం భవనం శిథిలావస్థకు చేరుకోగా యంత్రాలు తుప్పుబట్టాయి.

రూ.కోట్లలో భూముల ధరలు 
పోలేపల్లి శివారులో లెదర్‌ పార్కుకు కేటాయించిన భూముల విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఒకవైపు సెజ్‌.. మరోవైపు 44వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో భూమి విలువ రూ.కోట్లకు చేరింది. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరా ధర రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. ఇంత విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

ఏపీఐఐసీకి అప్పగింత 
పోలేపల్లి శివారులో జాతీయ రహదారితోపాటు సెజ్‌కు దగ్గరగా ఉన్న ఈ భూమిలో లెదర్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు లిడ్‌క్యాప్‌ 2008లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించింది. అయితే ఏపీఐఐసీ అధికారులు లెదర్‌ పార్కు ఏర్పాటుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో 25 ఎకరాల భూమి నిరుపయోగంగానే మారింది. దీంతో 2013లో ప్రభుత్వం ఏపీఐఐసీ నుంచి సదరు భూమిని వెనక్కి తీసుకొని మళ్లీ లిడ్‌క్యాప్‌కి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమిని స్వా«దీనం చేసుకున్న లిడ్‌క్యాప్‌ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దళితుల ఉపాధికి సంబంధించి ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలోని దళితులకు ఉపయోగపడేలా లెదర్‌ పార్కులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రూ.60 లక్షలు కేటాయింపు 
తెలంగాణ ప్రభుత్వం 2022లో లిడ్‌క్యాప్‌ శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించేందుకు రూ.60 లక్షలు కేటాయించింది. తమిళనాడులోని సీఎల్‌ఆర్‌ఐ (సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)కు సంబంధించి ఈ నిధులు కేటాయించినట్టు అప్పట్లో అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఆ నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.

ఎంతో మందికి ప్రయోజనం.. 
పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో లిడ్‌క్యాప్‌కు కేటాయించిన భూమిలో చర్మ ఉత్పత్తుల తయారీ సంబంధిత కార్యక్రమాలు చేపట్టడంపై ప్రభుత్వం దృషిŠాట్సరిస్తే ఎంతోమందికి ప్రయోజనం ఉంటుంది. సంబంధిత రంగాల్లో శిక్షణ పొందిన పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. లెదర్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో లభిస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి లెదర్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అవకాశాలు కల్పించాలి.. 
చర్మ ఉత్పత్తుల తయారీపై పొందిన శిక్షణ నిరుపయోగంగా మారింది. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించాం. లెదర్‌ పార్కులలో ఏర్పాటయ్యే పరిశ్రమలు తమ జీవితాలకు బాటలు వేస్తాయనుకున్నాం. కానీ, పాలకులు లెదర్‌ పార్కులపై దృష్టి సారించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలి. 
– కృష్ణయ్య, 
చర్మకారుల సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement