
రూ. 2.50 కోట్ల విలువైన సరుకు ఏపీ నుంచి జైపూర్‌కు తరలిస్తుండగా భద్రాద్రి జిల్లాలో స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
సుజాతనగర్: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలిస్తున్న 499 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సరుకు విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కంటైనర్‌లో గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సుజాతనగర్ ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో కంటైనర్‌లో రవాణా చేస్తున్న 96 గంజాయి ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. కంటైనర్ యజమాని సంజుకుమార్, మహారాష్ట్రకు చెందిన జగదీశ్ దయారాంను అరెస్ట్ చేశామని, వీరితో సంబంధం ఉన్న అమిత్ రోహిదాస్ పాటిల్ (మహారాష్ట్ర), హరి (ఒడిశా) పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. అరెస్టైన ఇద్దరిపై గతంలో కూడా పాడేరు, ఔరద్ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 59 మంది నుంచి రూ.25.85 కోట్ల విలువైన 52 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.