
అన్ని ఓట్లు ఉన్నాయి
హైదరాబాద్: యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఎన్నికల అధికారులు కొట్టివేశారు. శ్రీకృష్ణానగర్‌లోని బి–బ్లాక్‌లో ఉన్న 8–3–231/బి/160 నెంబర్‌గల సంస్కృతి ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌ను సోమవారం ఎన్నికల అధికారులు సందర్శించారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖైరతాబాద్ తహశీల్దార్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఎల్‌ఓలు సోమవారం విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రామకృష్ణ, ప్రసన్న, సుబ్బరత్నమ్మ అనే ముగ్గురు మాత్రమే ఓటర్లు ఉంటున్నారు. అయితే మిగిలిన 39 మంది మాత్రం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లారు. సిని పరిశ్రమకు చెందిన వారుగా గుర్తించిన అధికారులు అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వారి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టŠస్‌లో వారు విధులు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు.
ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటి నెంబర్‌తో మరో ఓటును కూడా పొందారా అనే క్రమంలో విచారించగా ఇంకో ఓటు లేదని నిర్థరణకు వచ్చారు. తమ ఓటు అదే ఇంటి నెంబర్‌లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశామని అధికారులకు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఓట్లు వేస్తున్నట్లుగా తెలిపారను. కాగా ఇల్లు ఖాళీ చేసిన వారి ఓట్లను వారి అనుమతి లేకుండా తొలగించే హక్కు బీఎల్‌ఓలకు లేని కారణంగా వాటిని తొలగించలేదని, 43 ఓటర్లను గుర్తించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.