మాస్కు పెట్టుకోనందుకు 35,308 మందిపై కేసులు

35308 police Cases Registered For Not Wearing The Mask In Telangana - Sakshi

హైకోర్టుకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మార్కులు పెట్టుకోనందుకు 35,308 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ హైకోర్టుకు నివేదించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న వివరాలతో ఇటీవల ఆయన నివేదిక సమర్పించారు. సామాజిక దూరం పాటించనందుకు 1,211 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైనందుకు 82 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వివాహానికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదని, జీవో 75 జారీ చేశామన్నారు. దీన్ని ఉల్లంఘించి వివాహాలకు పెద్ద సంఖ్యలో హాజరైనందుకు 24 కేసులు నమోదు చేయగా.. 101 మందిని, అలాగే అంత్యక్రియలకు ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు 6 కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.

‘దేశంలోనే మొదటగా రాష్ట్రంలోనే మార్చి 14 నుంచే పాఠశాలలు, బార్లు, క్లబ్బులను మూసేయాలని నిర్ణయించాం. మార్చి 23 నాటికి 33 కేసులు ఉండగా.. జూన్‌ 29 నాటికి 15,394 కేసులు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కీలక సమాచారంతో మీడియా బులెటిన్‌ ఇస్తున్నాం. జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలతో కలెక్టర్లు కూడా మీడియాకు సమాచారం ఇస్తున్నారు. లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ యాం టిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జూన్‌ 29న 3,457 పరీక్షలు చేయగా.. జూలై 25 నాటికి వీటిసంఖ్యను 15,654కు పెంచి మొత్తం 2,64,852 మందికి పరీక్షలు చేశాం. పాజిటివ్‌ కేసులసంఖ్య 27.3 శా తం నుంచి 10.18 శాతానికి తగ్గింది. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) నిర్దేశించింది. అంతకంటే ఎక్కు వే ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు 57 ప్రభుత్వ, 54 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ కేటగిరీ బెడ్లు అందుబాటులో ఉన్నాయో మీడియా బులెటిన్‌లో స్పష్టంగా ఇస్తున్నాం. కంటైన్‌మెంట్‌ జోన్ల లో కేసులను గుర్తిస్తున్నాం. హైకోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తు న్నాం’ అని నివేదికలో వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top