పాలేరు వరద మధ్యలో బిక్కుబిక్కుమంటూ 21 మంది కూలీలు!

21 Laborers Trapped in Paleru River Flood in Mahabubabad Rescued - Sakshi

పాలేరు ఏరు రెండు పాయల మధ్య 21 మంది కూలీలు 

తెల్లవారిన తర్వాత ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

సాక్షి, మహబూబాబాద్‌/మరిపెడ రూరల్‌/మద్దిరాల: వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కూలీలు. కూలికోసం ఏరు దాటి వెళ్లారు. రోజువారీ­గా పనిచేస్తుండగానే ఒక్కసారిగా వచ్చిన వరద చుట్టుముట్టింది. రెండు పా­యలుగా ఉన్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం శివారులో పాలేరు వాగులో మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శ్రమించి కూలీలను శనివారం ఉదయం బయటకు తీసుకొచ్చింది.  

నీళ్ల మధ్య చిక్కుకున్న కూలీలు.. 
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని కోట్యాతండా, వాల్యతండా గ్రామ పంచాయతీల పరిధిలోని చౌళతండాకు చెందిన 17 మంది, వాల్యతండాకు చెందిన నలుగురు.. మొత్తం 21 మంది కూలీలు సరిహద్దు ప్రాంతంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన తిరుమలయ్య వ్యవసాయ క్షేత్రంలోని వరి నాటు వేయడానికి ఆటోలో శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ వాగు 2 పాయలుగా చీలిన ప్రదేశంలో రైతు వ్యవసాయ భూమి ఉంది. ఉదయం నాటు వేయడానికి వెళ్లినప్పుడు మాములుగానే ఉండటంతో కూలీలు వెళ్లి నాటు వేశారు. తిరిగివస్తుండగా వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఎటుచూసినా నీరు.. మధ్యలో కూలీలు ఉండిపోయారు. బయటికొచ్చే మార్గం లేకపోవడంతో ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పారు. వారు అధికారులకు సమాచారం అందించారు.  

ఉదయం సురక్షితంగా.. 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూలీలను బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి డ్రోన్‌ ద్వారా కూలీలకు ఆహారం అందజేశారు. రాత్రి 2గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకున్నా వర్షం కురుస్తుండటంతో కూలీలను ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్‌ ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృంద ఇన్‌చార్జి మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలో శ్రమించి బోటు సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో కూలీలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్‌ శశాంక్‌ రక్షణ చర్యలను పర్యవేక్షించారు.  

చీకట్లో గడిపాం 
పాలేరు వాగు మధ్యలో ఉండిపోయి రాత్రంతా కారు చీకట్లో ఉండిపోయాం. అధికారులు ధైర్యం చెప్పినా భయం వేసింది. తాగేందుకు నీళ్లు కూడా లేవు. రాత్రి మొత్తం బురదలో నిలబడే ఉన్నాం.     
–తేజావత్‌ దేవి 

నా కొడుకు గుర్తుకొచ్చాడు 
వాగులో చిక్కుకున్న. నా రెండేళ్ల కొడుకు గుర్తుకు వచ్చి ఏడ్చా. తోటి కూలీలు ధైర్యం చెప్పి నన్ను ఓదార్చారు. అయినప్పటికి కొడుకును చూస్తాను అనుకోలేదు.  
–ఆంగోతు కవిత, చంటి బిడ్డతల్లి

ఇదీ చదవండి:  Telangana: రానున్న 2 రోజుల్లో అతి భారీ వ‌ర్షాలు.. 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top