ఊళ్లకు ఆర్టీసీ ప్రతినిధులు

2 thousand village bus officers will enter the field from next month - Sakshi

వచ్చే నెల నుంచి రంగంలోకి 2 వేల మంది విలేజ్‌ బస్‌ ఆఫీసర్లు

పక్షానికోమారు గ్రామస్తులతో భేటీ, వివరాల సేకరణ

ఆసక్తిగల డ్రైవర్లు, కండక్టర్లకు ఐదేసి ఊళ్లకు మించకుండా బాధ్యతలు

ప్రైవేటు వాహనాల దూకుడుకు కళ్లెం వేసి ఆదాయాన్ని పెంచుకొనే ఉద్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలకు క్రమంగా ఆర్టీసీ బస్సులు దూరమై ప్రయాణికులకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు చేరువగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ పేరుతో తమ ప్రతినిధులను పల్లెబాట పట్టించనుంది. ప్రతి ఊరిలోనూ తమ ప్రతినిధిని అందుబాటులో ఉంచనుంది. గ్రామాలకు ప్రజారవాణా అవసరాలేంటో గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఒక్కో ప్రతినిధికి ఐదు ఊళ్లకు మించకుండా బాధ్యత అప్పగించేలా మే ఒకటో తేదీ నుంచి 2 వేల మంది ప్రతినిధులను రంగంలోకి దింపనుంది. రెగ్యులర్‌ డ్యూటీ చేస్తూనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ ప్రతినిధుల బాధ్యత భుజానికెత్తుకోనున్నారు. వీక్లీ ఆఫ్, ఇతర సెలవు రోజుల్లో వారు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులు, సర్పంచులతో చర్చించి ఆయా ఊళ్లు ఆర్టీసీ నుంచి ఏం కోరుకుంటున్నాయో, ఆయా ఊళ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీకి ఉన్న అవకాశాలేంటో తెలుసుకోనున్నారు. 

ప్రజలు బస్సెక్కేలా చేయడమే లక్ష్యం... 
రాష్ట్రంలో 12,769 గ్రామాలున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు తప్ప మిగతా ఊళ్లకు పల్లెవెలుగు/ఇతర కేటగిరీల ఆర్టీసీ బస్సులు నడిచేవి. కానీ ఏడెనిమిది ఏళ్లుగా ఆదాయం కోసం శ్రమిస్తున్న ఆర్టీసీ... ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న గ్రామాలకు ట్రిప్పులు తగ్గించి ఆదాయం ఎక్కువగా ఉండే మార్గాలకు మళ్లించింది.

కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతోపాటు సర్విసుల సంఖ్య తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. అద్దె బస్సుల సంఖ్య పెరగడం, వాటి నిర్వాహకులు ఆదాయం ఉన్న మార్గాలపైనే దృష్టి పెట్టడంతో వేల సంఖ్యలో ఊళ్లకు ఆటోలే దిక్కయ్యాయి. ఈ తరుణంలో ప్రజారవాణాను మెరుగుపరిచి గతంలోలాగా ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించేలా చేయాలన్నది యాజమాన్యం లక్ష్యం.  

నెలకు రూ. 300 అదనపు చెల్లింపులు! 
ఊళ్లతోపాటు హైదరాబాద్‌ సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా వార్డులు, డివిజన్ల బాధ్యతను ఆర్టీసీ ప్రతినిధులకు అప్పగించనున్నారు. వారికి నెలకు రూ. 300 వరకు అదనంగా చెల్లించనున్నట్లు తెలిసింది. ప్రతి మూడు నెలలకు సమీక్షించి ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించనుంది. అయితే కేవలం బస్సులు నడిచే ఊళ్ల బాధ్యతే అప్పగిస్తారా, బస్సు సౌకర్యంలేని ఊళ్ల బాధ్యత కూడా ఉంటుందా అన్నది ఇంకా తెలియరాలేదు.

కాగా, ఆర్టీసీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని, ఈ తాజా నిర్ణయానికి కూడా సానుకూలంగా స్పందించి ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్‌ పేర్కొంటున్నారు.  

ఆర్టీసీ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ విధులు ఏమిటంటే..? 
 ♦ ప్రతి 15 రోజులకోసారి ఊళ్లకు వెళ్లి సర్పంచులు, సాధారణ ప్రజలతో కలసి ఆయా ఊళ్ల రవాణా అవసరాలపై వివరాలు సేకరించాలి. 
♦ ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చైతన్యపరచాలి. 
♦ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనంగా ట్రిప్పులు అవసరమన్న విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. 
ఆయా ఊళ్లలో ఉత్సవాలు, జాతరలు, పెళ్లిళ్ల తేదీల వివరాలు సేకరించి వాటి రూపంలో ఆదాయం పెంచుకొనే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులకు చెప్పాలి. 
 ఇతర రోజుల్లో కూడా తమకు వివరాలు ఫోన్‌ చేసి చెప్పొచ్చని గ్రామీణులను కోరాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top