160 ఏళ్ల తర్వాత ‘కపాల మోక్షం’

160 Year Old Human Skeletons Found In Punjab Are Ganga Plain Martyrs - Sakshi

పంజాబ్‌ బావిలోని పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవి

వీటి డీఎన్‌ఏ ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోంది: సీసీఎంబీ

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం: ప్రొ.జ్ఞానేశ్వర్‌ చౌబే

సాక్షి, హైదరాబాద్‌: 160 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. పంజాబ్‌లోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివో తేలిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2014లో అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద ఎత్తున బయటపడ్డ మానవ కపాలాలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ ప్రకటించింది.

ఇప్పటివరకూ ఈ కపాలాలు 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని,  కొందరు చరిత్రకారులు చెబుతుండగా.. మరికొందరు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివి కావచ్చనని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు ఏదీ నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌.. సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్‌ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పుర్రెల నుంచి డీఎన్‌ఏను వెలికితీసి పరిశీలించగా.. మరణించిన వారు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది. ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. 

బెంగాల్‌ నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌ సైనికులవి!
‘ఈ పరిశోధన ఫలితాలు చారిత్రక ఆధారాలతోనూ సరిపోతున్నాయి. ఎందుకంటే.. 26వ బెంగాల్‌ నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో బెంగాల్‌ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోంది’ అని డాక్టర్‌ సెహ్రావత్‌ వివరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్‌కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రాంతంలోని మియాన్‌ మీర్‌ ప్రాంతంలో నియమించారు. బ్రిటిష్‌ అధికారులపై తిరుగుబాటు చేసిన వీరు కొందరిని హతమార్చారు కూడా.

అయితే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్‌ అధికారులు వీరిని అజ్‌నాలా సమీపంలో బంధించి చంపివేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పరిశోధన ఫలితాలు భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చేరుస్తాయని, ఇప్పటివరకూ ఎవరూ గుర్తించని తొలి స్వాతంత్య్ర సంగ్రామం ఇదే కావచ్చునని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన బెనారస్‌ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు. పలు చారిత్రక మిస్టరీలను ఛేదించేందుకు తాము భవిష్యత్తులోనూ ఇలాంటి పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి తెలిపారు. 

పంజాబ్, పాకిస్తాన్‌ ప్రజలవి కాదు
అజ్‌నాలాలో బయటపడ్డ పుర్రెల నుంచి 50 శాంపిల్స్‌ను సేకరించి డీఎన్‌ఏ ఐసోటోపులను పరిశీలించామని..ఆ ప్రజల పూర్వీకులు, ఆహారపు అలవాట్లు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయని సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.తంగరాజ్‌ తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్‌ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్‌ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top