
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు సంజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, నందీశ్వర్‌గౌడ్, డా.జి.మనోహర్‌రెడ్డి, డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఉమారాణి భానుప్రకాష్‌లతో కూడిన ప్రతినిధిబృందం వినతిపత్రం అందజేసింది.
ప్రధానిని కించపరిస్తే 140 కోట్ల మంది భారతీయులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ప్రధాని భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్రశాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాగా, ఉద్యోగులు, టీచర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించేదాకా తెగించి కొట్లాడతామని సంజయ్ ప్రకటించారు. ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం(తపస్) ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన టీచర్లు సంజయ్‌ను కలిశారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ తప్పులతడకగా ఉందని పలువురు టీచర్లు వాపోయారు. స్థానికతకు విరుద్ధంగా తమను వందల కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతాలకు బదిలీచేస్తున్నారని వాపోయారు.