తెలంగాణ శ్రేయస్సు, సౌభాత్యం కోసం ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ 

PM Modi Congratulated Telangana People On State Farmation Day - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

‘తెలంగాణ ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాత్యం కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను గవర్నర్‌ సన్మానించారు. అనంతరం, తమిళిసై మాట్లాడుతూ.. ‘అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదం. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు. 

స్వరాష్ట్ర ఏర్పాటులో బాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం నా అదృష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను కలిశాను. హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. కేవలం ఒక్క చోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృధి జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. తెలంగాణ అంటే స్లోగన్ కాదు.  అది ఆత్మ గౌరవ నినాదం. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. కేంద్రం సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగింది. కానీ, నేటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు’ అని అన్నారు. 

మరోవైపు, బీజేపీ స్టేట్‌ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులో బండి సంజయ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ నమ్మింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీది ప్రధాన పాత్ర. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తుంది. తెలంగాణలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుంది. కేవలం నలుగురి కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుంది’ అంటూ విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్‌ పోరాడారు: కిషన్‌ రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top