1,518 సివిల్‌ కేసుల పరిష్కారం

1,518 Civil Cases Settled In Hyderabad District City Civil Courts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా సిటీ సివిల్‌ కోర్టుల్లో 1,518 సివిల్‌ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్‌ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం  జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్‌ ప్రమాదం ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు.

పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్‌ కేసులు, 1,092 ఎస్‌బీఐ బ్యాంక్‌ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్‌ లోనే  సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్‌ అదాలత్లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్‌ జడ్జి కె ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు.

న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి కే.మురళీమోహన్‌ మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌ లో పరిష్కారమైన సివిల్‌ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యదర్శి నాగభూషణం,  మాట్లాడారు.  సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌ న్యాయస్థానంలోని లోక్‌ అదాలత్‌ బెంచ్‌లకు చీఫ్‌ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్‌ జడ్జ్‌ కె ప్రభాకర్‌ రావు,  అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి,  అపర్ణ , సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌ మహి, జూనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ్‌ కుమార్‌ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో అదనపు చీఫ్‌ జడ్జి జీవన్‌ కుమార్‌ నేతృత్వం వహించారు.  

రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం 
రాచకొండ కమిషరేట్‌ పరిధిలో పెండింగ్‌ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్‌ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్‌ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్, సెషన్స్‌ జడ్జి వీ బాల భాస్కర్‌ రావులు లోక్‌ అదాలత్‌ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్, అదనపు సిపి జీ సుధీర్‌ బాబు తదితర పోలీస్‌ అధికారులు పాల్గొని లోక్‌ అదాలత్‌ నిర్వహణను పర్యవేక్షించారు.   

(చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top