10,673 టీచర్‌ పోస్టులు ఖాళీ

10,673 Teacher Posts Are Vacant In Telangana - Sakshi

వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్‌ కానున్న మరో 2,264 మంది  

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖలో పదవీ విరమణలతో 10,673 టీచర్‌ పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు ఉండగా, మిగతావి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు, హెడ్‌మాస్టర్‌ (హెచ్‌ఎం) పోస్టులు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే వీలు లేదు. అందులో 6 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉండగా, ఎస్‌ఏ ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, 30 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.  

వచ్చే విద్యా సంవత్సరంలో... 
వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) మరో 2,264 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారని విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 199 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారు. ఆ తరువాత అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 186 మంది టీచర్లు రిటైర్‌ కానున్నారు. అలాగే సంగారెడ్డిలో 152 మంది, సిద్దిపేట్‌ జిల్లాలో 139 మంది, నిజామాబాద్‌లో 136 మంది, వరంగల్‌ అర్బన్‌లో 106 మంది, కరీంనగర్‌లో 99 మంది, మిగతా వాటిలో ఒక్కో జిల్లాలో 8 మంది నుంచి 99 మందిలోపు టీచర్లు పదవీ విరమణ పొందనున్నట్లు లెక్కలు తీసింది. 

దీర్ఘకాలిక సెలవుల్లో 615 మంది టీచర్లు 
మరోవైపు 615 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు విద్యాశాఖ తేల్చింది. అందులో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 89 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు పేర్కొది. నాగర్‌కర్నూల్‌లో 65 మంది, రంగారెడ్డి జిల్లాలో 62 మంది, నల్లగొండలో 62 మంది, మెదక్‌లో 52 మంది, జోగులాంబ జిల్లాలో 30 మంది, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 34, సిద్ధిపేట్‌లో 22, నిజమాబాద్‌లో 17, నిర్మల్‌లో 18, మంచిర్యాలలో 17 మంది టీచర్లు ధీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒక్కరి నుంచి 15 మంది వరకు లాంగ్‌లీవ్‌లో ఉన్నట్లు తెలిపింది.   

చదవండి: (ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top