సైబర్‌ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్‌వర్డ్‌ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Telangana 5S Principles For Cyber Security Password Careful - Sakshi

రోజువారీ జీవితంలో స్మార్ట్‌ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్‌ మీడియా యాప్స్‌ వాడకం మొదలు ఆన్‌లైన్‌ ఆర్డర్లు, ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్‌ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్‌ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్‌ జమానాలో సేఫ్‌గా ఉండేందుకు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్‌ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. 

 ఏమిటి ఆ 5ఎస్‌?
స్ట్రాంగ్‌ అండ్‌ యూనిక్‌ పాస్‌వర్డ్, సెక్యూర్‌ నెట్‌వర్క్, సెక్యూ­ర్‌ వెబ్‌సైట్స్‌ లేదా యాప్స్, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్, సస్పీషియస్‌ లింక్‌ అలర్ట్‌...కలిపి 5 ఎస్‌లుగా పోలీసులు సూత్రీకరించారు. 

స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్
మనం సోషల్‌ మీడియా ఖాతాల­కు, ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్‌కు వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ఉత్తమం. ఒక­టే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ పెట్ట­డం రిస్క్‌ అని గుర్తించాలి. పాస్‌వర్డ్‌లో వీలైనంత వరకు మన పేరు, బర్త్‌డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్‌వర్డ్‌ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరా­ల మిళితంగా పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్‌ చేయవద్దు.  

సెక్యూర్‌ వెబ్‌సైట్స్, యాప్స్, సెక్యూర్‌ నెట్‌వర్క్‌..
మనం వాడే వెబ్‌సైట్‌లు, డౌన్‌లోడ్‌ చేసుకొనే యాప్స్‌ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే ముందు ఆ యాప్‌ రేటింగ్‌ పరిశీలించాలి. 

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌..
మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వల్ల సైబర్‌ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించుకోవాలి.  

సస్పీషియస్‌ లింక్‌ అలర్ట్‌... 
మనకు మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు, ఈ–మెయిల్స్‌ రూపంలో వచ్చే మెసేజ్‌లలోని అనుమానాస్పద లింక్‌లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్‌ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్‌లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్‌లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top