
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్‌లకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మల్లు రవి
అభిప్రాయాలను అంతర్గతంగానే తెలియజేయాలి
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించిన కమిటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కదా అని నేతలెవరూ లక్ష్మణ రేఖ దాటొద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామిక వాతావరణం ఉంటుందని.. పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాలుగు గోడల మధ్య అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మల్లు రవి నేరుగా గాంధీ భవన్‌కు వచ్చి అక్కడ మాజీ చైర్మన్ జి.చిన్నారెడ్డి నుంచి బా«ధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు. క్రమశిక్షణ గీత దాటకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చూడాలని కోరారు. తాను మూడు సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించానని.. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవి రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా పాలన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతోందని మల్లు రవి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత ప్రభుత్వాలు దోపిడీ చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పలు పథకాలు, కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏడాదిన్నరకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.