● తమిళనాడు ’స్టార్టప్‌టీఎన్’ తో అవగాహన ఒప్పందం
సాక్షి, చైన్నె: ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అయిన వోల్టర్ తన ఏఐ మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ చైన్నెలో 20 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏఐ సూపర్‌కంప్యూట్ క్లస్టర్‌ను ప్రారంభించింది. అమెరికాలోని ప్రధాన కేంద్రం తర్వాత వోల్టర్ సంస్థకు ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద సూపర్‌కంప్యూటర్ సదుపాయం కావడం విశేషం. 20 మెగావాట్ల కంప్యూటింగ్ సామర్థ్యంతో 10,000 కంటే ఎక్కువ ఏఎండీ ఇన్‌స్టింక్ సామర్థ్యంతో ఇది పనిచేయనున్నది. భారీ స్థాయి ఏఐ శిక్షణ , డేటా విశ్లేషణ అవసరాలను తీర్చడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. తమిళనాడు ప్రభుత్వం కింద పనిచేసే స్టార్టప్‌టీఎన్ తో వోల్టర్ సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్‌లకు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాసెస్ ధరలపై ప్రత్యేక తగ్గింపులు , ఉచిత క్రెడిట్లను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్‌ఆఫీసర్ కెవిన్ కాక్రేన్ , ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి మధన్ రాజాలు మాట్లాడుతూ, సాంకేతికత ఎంత అధునాతనమైనదనేది కాదని, అది ఎంతమందికి అవకాశాలను సృష్టిస్తుందనేదే ముఖ్యంగా పేర్కొన్నారు. చిన్న పట్టణాలలోని స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు కూడా ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ – డిజిటల్ సర్వీసెస్ అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ అతుల్ ఆనంద్, స్టార్టప్ టీఎన్ చైర్మన్ జి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
జైలు బజార్ పునర్ ప్రారంభం
కొరుక్కుపేట: పుళల్ జైలుకు చెందిన ఇద్దరు ఖైదీలు, తేని జైలుకు చెందిన 17 మంది ఖైదీలు ఒకరి తర్వాత ఒకరు పారిపోవడం పెద్ద కలకలం రేపింది. అనంతరం వారందరిని అరెస్టు చేశారు. దీని తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా, జైలు బయట ఖైదీలు నడుపుతున్న జైలు బజార్లు, పెట్రోల్ స్టేషన్లను మూసివేశారు. పుళల్ జీఎస్‌డీ రోడ్డులో ఖైదీలు నడుపుతున్న రెస్టారెంట్, కబేళా, పెట్రోల్ పంపును కూడా మూసివేశారు. ఇదిలా ఉండగా, పుళల్ జైలు ఖైదీలకు మరిన్ని ప్రయోజనాలు. ’ఫ్రీడమ్ బజార్’లో లభించే వస్తువులు ఇప్పుడు జైలులో కూడా అందుబాటులో ఉంటాయి. అందించే సేవ విషయానికి వస్తే, ’టోకెన్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. పుజల్ జైలు–1 సమీపంలో పనిచేస్తున్న ఫ్రీడమ్ బజార్ దుకాణం మాత్రమే సోమవారం తెరుచుకుంది. బంధువులు మిఠాయిలు, బిస్కెట్లు, మసాలాలు, రొట్టె, ఊరగాయలు, చొక్కాలు వంటి వస్తువులను కొనుగోలు చేసి ఖైదీలకు నేరుగా అందించే బదులుగా, వాటిని టోకెన్ పద్ధతి ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేశారు. దీనిని ఉపయోగించి, సంబంధిత ఖైదీలు జైలు లోపల సామాగ్రిని పొందగలరు. దీపావళికి ముందు, ఖైదీలకు పంపిణీ చేసేందుకు పావు కిలో మిఠాయిలను రూ. 125 రాయితీ ధరకు విక్రయిస్తున్నారు.
టాస్మాక్ ఉద్యోగులపై కన్నెర్ర
– 245 మంది సస్పెన్షన్
– 1,729 మందికి మెమోలు
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఖాళీ మద్యం సీసాల రీఫండ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దుకాణాలు తెరవని టాస్మాక్ ఉద్యోగులపై మార్కెటింగ్ కార్పొరేషన్ కన్నెర్ర చేసింది. విధులను విస్మరించిన 245 మంది సూపర్‌వైజర్‌లను సస్పెండ్ చేయగా, మరో 1,729 మంది ఉద్యోగులకు వివరణ కోరుతూ మెమోలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం కొనుగోలుపై గరిష్టంగా రూ. 10 అదనంగా వసూలు చేసి, వినియోగదారులు ఖాళీ సీసాలను తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసే కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఖాళీ సీసాలను నిల్వ చేయడానికి తగినంత స్థలం లేకపోవడం, స్కాన్ చేసే పరికరాలు ఇవ్వకపోవడం , అదనపు పనిభారం పడటంతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆది, సోమ వారం దుకాణాలు మూసి వేసి నిరసనకు దిగారు. ఈ నిరసనల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 650కి పైగా టాస్మాక్ దుకాణాలు మూతపడ్డాయి. తెరిచి ఉన్న దుకాణాల వద్ద మద్యం ప్రియులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వచ్చింది.దీంతో విధులను విస్మరించిన చైన్నె జోన్‌లో 169 మందిని సస్పెండ్ చేశారు. అలాగే,సేలం జోన్: 75 మంది, మదురై జోన్‌లో ఒకరిని సస్పెండ్ చేశారు. జిల్లా స్థాయిలో కృష్ణగిరిలో 75 మంది, తిరువళ్లూరులో 61 మంది, చైన్నె నార్త్‌లో 58 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు.అలాగే, మదురై జోన్‌లో అత్యధికంగా 475 మందికి, సేలంలో 459 మందికి, తిరుచ్చిలో 418 మందికి మెమోలు పంపారు. చైన్నెలో 341 మందికి మెమోలు ఇచ్చారు.చైన్నె పరిసర జిల్లాల్లోని దాదాపు 900 దుకాణాల్లో కేవలం 556 మాత్రమే పనిచేస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి రెండు రోజుల పాటుగా గండి పడింది.


