సాక్షి, చైన్నె : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుచెందూర్ ఎమ్మెల్యే, డీఎంకే మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్ (74), ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో అనితా రాధాకృష్ణన్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ తూత్తుకుడి జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2001 నుండి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోగృహ, పశుసంవర్ధక శాఖల మంత్రిగా పనిచేసిన సమయంలో, అనితా రాధాకృష్ణన్ తన ఆదాయానికి మించి రూ. 2.7 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ. 96,384 విలువైన ఆస్తులను కూడబెట్టారంటూ అవినీతి నిరోధక విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనితా రాధాకృష్ణన్‌తో పాటు ఆమె భార్య జయగంటి (66), సోదరులు షణ్ముగానందన్ (58), శివానందన్ (61), , కుమారులు అనంత పద్మనాభన్ (47), అనంత రామకృష్ణన్ (45), అనంత మహేశ్వరన్ (44)లను నిందితులుగా చేర్చారు. 2006లో నమోదైన ఈ కేసును ఆ తర్వాత అనేక పరిణామాలు చుట్టుముట్టాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో జోక్యం చేసుకుని, కేసును మదురై కోర్టుకు బదిలీ చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అనితా రాధాకృష్ణన్ డీఎంకేలో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే, ఈ పిటిషన్‌ను గత ఆగస్టులో కొట్టివేసిన హైకోర్టు... తూత్తుకుడి కోర్టులోని విచారణపై ఉన్న స్టేను ఎత్తివేసి, విచారణను త్వరగా ముగించాలని ఆదేశించింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి ఎస్. సుభాదేవి సాయంత్రం 4:30 గంటలకు తీర్పును వెలువరించారు: నేరారోపణలను నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించడంలో విఫలమైందన్నారు. నిరూపించబడని ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోలేమని, ఈ దృష్ట్యా, అనితా రాధాకృష్ణన్‌తో పాటు కేసులోని మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పువెలువరించారు.


