సాక్షి, చైన్నె: తమిళనాడు – కాశీ మధ్య శతాబ్దాల తరబడి బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో ఐఐటీ మద్రాస్ నిర్వహించనున్న కాశీ తమిళ సంగమం 5.0 ప్రివ్యూ కార్యక్రమం మంగళవారం చైన్నెలోని ఐఐటీ మద్రాస్‌లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ అర్లేకర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగమే ఏటా కాశీ తమిళ సంగమం నిర్వహిస్తున్నారని కొనియాడారు. భారతదేశం విభిన్న ఆచారాలు, సంప్రదాయాల సమాహారమైనప్పటికీ, మనందరినీ అనుసంధానించేది ఒకే భారతీయ సంస్కృతి అని స్పష్టం చేశారు. తమిళనాడుకు కాశీతోనే కాకుండా సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఒడిశాలతో కూడా ప్రాచీన సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
కాశీ తమిళ సంగమం 5.0 వివరాలు
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 28 నుండి డిసెంబర్ 12 వరకు కాశీ తమిళ సంగమం 5.0 జరగనున్నదని వివరించారు. ఈసారి ముఖ్య ఇతివృత్తంగా తిరుక్కురళ్‌ను అధ్యయనం చేద్దాం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. తిరుక్కురళ్ , కాశీపై నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సుమారు 1,500 మందిని ఎంపిక చేసి కాశీ, ప్రయాగ్‌రాజ్ పర్యటనకు పంపుతామన్నారు. ఇందుకు దరఖాస్తుకు ఈనెల 13 చివరి తేదిగా ప్రకటించారు.
పరిశోధన ఫెలోషిప్
తిరుక్కురళ్‌పై పరిశోధనా పత్రాలు రాసేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది కళాశాల విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ. 10,000 ఫెలోషిప్ అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ రాజలింగం బసు, సెంట్రల్ క్లాసికల్ తమిళ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ చంద్రశేఖరన్, ప్రముఖ వ్యాపారవేత్త నల్లి కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.


