సాక్షి, చైన్నె : సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్న 87 రిసార్ట్‌లను తక్షణమే మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరుకు చెందిన సౌండ్ అవేర్‌నెస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు కర్పగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లో జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి , కొండ సంరక్షణ కమిషన్ అనుమతి లేకుండా అక్రమంగా రిసార్ట్‌లు నడుస్తున్నాయని, దీనివల్ల పర్వత పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పిటిషనర్ పేర్కొన్నారు. జస్టిస్ ఎన్. సతీష్‌కుమార్ , జస్టిస్ జి.కె. ముత్తుకుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
జిల్లా కలెక్టర్ నివేదిక
ఈరోడ్ జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా సత్యమంగళం పులి సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న 87 రిసార్ట్‌లలో దేనికి కూడా సరైన చట్టబద్ధమైన అనుమతులు లేవని తేలింది. నివాసాలను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించేందుకు కొండ సంరక్షణ అథారిటీ అనుమతి ఇచ్చినట్లు ఆధారాలు లేవని వెల్లడైంది. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఈ 87 రిసార్ట్‌లను వెంటనే మూసివేసి, ఆపై వాటిని కూల్చివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మూసివేసిన కొన్ని రిసార్ట్‌లు దొడ్డిదారిన మళ్లీ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న పిటిషనర్ ఫిర్యాదుపై స్పందిస్తూ, లైసెన్సులు లేని అన్ని రిసార్ట్‌లను వెంటనే సీల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై నవంబర్ 27 లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేశారు.


