సాక్షి, చైన్నె : డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఇంటి వివాహం పురోహిత పద్ధతిలో జరగడం వివాదానికి దారి తీసింది. ద్వంద్వ వైఖరి వీడాలని ద్రవిడ కళగం నేత కె వీరమణి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ కుమారుడు కదిర్‌ఆనంద్‌కుమార్తె వివాహం పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం ద్రవిడ ఆదర్శాల ప్రకారం ఆత్మగౌరవ వివాహాలు (పురోహితులు, మంత్రాలు లేని పెళ్లిళ్లు) జరగాల్సి ఉండగా, ఈ వేడుక సంస్కృత వేద మంత్రాల నడుమ పురోహిత పద్ధతిలో జరిగిందన్న వార్తలు తాజాగా వివాదానికి దారి తీసినట్లయ్యింది. ఈ విషయంగా ద్రవిడ కళగం నేత వీరమణి స్పందిస్తూ, కొద్ది సంవత్సరాలుగా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న దురై మురుగన్ కుమారుడు, వేలూరు డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్‌కుమార్తె సెంతామరై వివాహం గురించి ప్రస్తావించారు. ఈ వివాహ ఆహ్వానంలో పెరియార్, అన్నా, కరుణానిధి, ఎం.కె. స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ల చిత్రాలు కూడా ఉన్నాయని వివరించారు. నవంబర్ 1న ఈ వేడుక జరిగినట్టుగా వచ్చిన వార్తలను గుర్తు చేశారు.
ద్వంద్వ వైఖరి నశించాలి
డీఎంకే నాయకత్వంలో పనిచేస్తూ, ద్రవిడ నాయకుల చిత్రాలను పత్రికలపై ముద్రించి, ఇంట్లో మాత్రం వైదిక పద్ధతిలో పెళ్లిళ్లు చేయడం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని వీరమణి మండిపడ్డారు. ఇలాంటి వైఖరిని డీఎంకే నాయకుడు ఎం.కె. స్టాలిన్ వెంటనే నిరోధించాలని కోరారు. 45 ఏళ్లకు పైగా పార్టీలో కొనసాగుతున్న దురైమురుగన్ వంటి సీనియర్ నాయకుడు ఇలా చేయడం ఆయన ప్రజా జీవితానికి, ఉద్యమ సిద్ధాంతాలకు పెద్ద మచ్చ అని పేర్కొన్నారు. పాల కుండలో ఒక చుక్క విషం పడితే మొత్తం పాలు ఎలా పాడవుతాయో.. ఇది కూడా అంతేనని వ్యాఖ్యా నించారు. పెరియార్ ప్రవేశపెట్టిన ఆత్మగౌరవ వివాహ వ్యవస్థకు మాజీ ముఖ్యమంత్రి అన్నా చట్టబద్ధత కల్పించారని పేర్కొంటూ, ఇటువంటి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఆ సూత్రాల నుంచి వైదొలగుతారా? అని వీరమణి ప్రశ్నించారు. శత్రువులకు డీఎంకేపై దాడి చేయడానికి ఇలాంటి ఘటనలు అవకాశం కల్పిస్తాయని, ఇకనైనా పార్టీ నాయకత్వం ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ద్రవిడ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ సుభా. వీరపాండియన్, మాజీ ఎంపీ డాక్టర్ సెంథిల్‌కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


