ప్రజలతోనే నా ప్రయాణం! | - | Sakshi
Sakshi News home page

ప్రజలతోనే నా ప్రయాణం!

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● అక్టోబర్‌లో సాధించిన ఘనతలపై సీఎం విజయ్‌ ప్రత్యేక వీడియో ● నేడు పుదుకోట్టైలో పర్యటన

నేడు పుదుకోట్టైకు సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్‌లో సీఎం విజయ్‌ సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రత్యేక వీడియో క్లిప్‌ను ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఆదివారం విడుదల చేసింది. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే సీఎం విజయ్‌ ప్రయాణిస్తున్నారన్న ట్యాగ్‌ లైన్‌తో ఈ వీడియోలో వివరాలను పొందు పరిచారు. ప్రపథమంగా ఒక సీఎం నెల పాటుగా చేసిన ప్రగతిని ఇందులో వివరించారు. అక్టోబర్‌ నెలలో సీఎం విజయ్‌ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రస్తావించారు. అక్టోబర్‌ 2 న తమిళనాడు వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే వెట్రి పయనం పథకం ప్రారంభించారన్నారు. అక్టోబర్‌ 8 తమిళనాడు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు డ్రీమ్స్‌ ఒలింపిక్‌ అచీవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభ మైందన్నారు. అక్టోబర్‌ 11 ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పూందమల్లి – వడపళని మధ్య 11 ఎలివేటెడ్‌ మెట్రో రైల్‌ స్టేషన్ల ప్రారంభోత్సవం ప్రస్తావించారు. అక్టోబర్‌ 13 గోదావరి–కావేరి అనుసంధానం , చైన్నె తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలు, అక్టోబర్‌ 16న కోయంబత్తూరులో రూ. 301.71 కోట్ల వ్యయంతో నిర్మించిన పెరియార్‌ సైన్స్‌ సెంటర్‌ ప్రారంభం గురించి వివరించారు. అక్టోబర్‌ 22న మెరీనా వద్ద వర్షపు నీటి సంరక్షణపై అవగాహన పెంచే కార్యక్రమం ప్రారంభం, అక్టోబర్‌ 23న వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు ఎంపికై న 69 మందికి నియామక పత్రాల అందజేత, 28న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలో అధునాతన ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌ల ప్రారంభం, ఎంఓయూ ఒప్పందం, 29న సీఎం కప్‌ 2026 క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ట్రోఫీలు, క్రీడా స్కాలర్‌షిప్‌ల పంపిణీ గురించి విశదీకరించారు. నిరంతరం ప్రజలతోనే సీఎం విజయ్‌ ఉన్నారని, వారి కోసం శ్రమిస్తున్నారని వివరించారు.

14న అంబైలో 25 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో

తిరునల్వేలి జిల్లాలోని అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య తన పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. ఫలితంగా, ఆ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇసక్కి సుబ్బయ్య మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సీఎం విజయ్‌ ఆ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం వెలువడింది.ఆయన 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా జరిగే బాలల దినోత్సవ కార్యక్రమంలో అంబాసముద్రం స్వీకరించడానికి పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో ఆయన పిల్లలకు కేక్‌ బహుకరిస్తారు. ఈ వేడుకలో భాగంగా 25 కి.మీ దూరం సీఎం విజయ్‌ రోడ్‌ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళనాడులో 26 కొత్త ప్రత్యేక కోర్టులు

తమిళనాడులో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు , బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 కొత్త ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం విజయ్‌ ఆదేశించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోక్సో కేసుల స్థితిగతులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం విజయ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. విచారణను వేగవంతం చేసి దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. కొత్తగా 12 ప్రత్యేక కోర్టులు, 14 అదనపు కోర్టులు కలిపి మొత్తం 26 కొత్త పోక్సో కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 46.59 కోట్లు కేటాయించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 22 పోక్సో ప్రత్యేక కోర్టులు పనిచేస్తుండగా, ఈ కొత్త కోర్టులతో కలిపి మొత్తం 52 ప్రత్యేక కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. కాగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం, మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడం, అవినీతి నిరోధక కేసుల విచారణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సీఎం విజయ్‌ అభివాదం

సీఎం విజయ్‌ సోమవారం పుదుక్కోట్టై జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, వేలాది మంది లబ్ధిదారులకు సంక్షేమ సహాయాన్ని అందజేయనున్నారు. రూ. 22 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన బస్టాండ్‌ను, అలాగే రూ. 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇండోర్‌ స్పోర్ట్స్‌ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సాయుధ దళాల మైదానంలో జరిగే భారీ ప్రభుత్వ నియోజకవర్గ కార్యక్రమంలో పాల్గొని, సుమారు 14,000 మంది లబ్ధిదారులకు రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సీఎం అందజేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు చైన్నె నుంచి ప్రైవేట్‌ విమానంలో తిరుచ్చి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుదుక్కోట్టైకి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభోత్సవాల్లో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి నుంచి తిరిగి చైన్నెకి పయనమవుతారు. విజయ్‌ తొలిసారిగా పుదుక్కోట్టైకి వస్తుండటంతో టి.వి.కే శ్రేణులు భారీ ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుచ్చి – పుదుక్కోట్టై మార్గంలో 35 కిలోమీటర్ల మేర 11,000 కంటే ఎక్కువ ఇనుప బ్యారియర్‌లను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో డ్రోన్ల వినియోగాన్ని నిషేధించారు. అలాగే మార్గమధ్యంలో ఉన్న 13 మద్యం దుకాణాలను మూసి వేస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement