– 30,000 మందికి 100 శాతం సబ్సిడీతో జీవాల పంపిణీ
సాక్షి, చైన్నె: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, దివ్యాంగులు, నిరుపేదల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వెట్రి మహిళా మేకల పెంపకం పథకం అమలుకు చర్యలు తీసుకున్నారు. 30,000 మంది అర్హులైన లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో తలా 5 మేకలు ఉచితంగా అందించే ప్రాజెక్టుకు రూ. 109.75 కోట్లను కేటాయిస్తూ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం కేటాయించిన నిధులు: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 109.75 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్య– సుమారు 30,000 మందిగా నిర్ణ యించారు. లబ్ధిదారులకు అందే ప్రయోజనంగా 100% సబ్సిడీతో 5 తెల్ల గోర్రెలు లేదా మేకల ఉ చిత పంపిణీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన క్రింది వర్గాల ప్రజలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. నిస్సహాయ వితంతువులు, నిరుపేద మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులుకు కూడా అర్హులేనని వివరంచారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం..
తమిళనాడు ప్రభుత్వ 2026–27 బడ్జెట్ ప్రకటనలో పశుసంపద రంగాన్ని రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించింది. ఆహార భద్రత, ఉపాధి కల్పన మరియు గ్రామీణ ఆర్థిక ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ తెలిపారు. పశుసంపదను జీవనోపాధిగా అందించడం ద్వారా ఈ వర్గాలకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు, గ్రామీణ సమాజంలో స్వయం సమృద్ధి పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
జీపీఎస్ పరికరం లేకుంటే
– ఖనిజ ట్రక్కులకు అనుమతి లేదు
కొరుక్కుపేట: నవంబర్ 1 నుంచి జీపీఎస్ పరికరాలు లేని ఖనిజ వనరుల రవాణా ట్రక్కులకు ట్రాఫిక్ పర్మిట్లు జారీ చేయబోమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. భూగర్భ శాస్త్ర, గనుల శాఖ ఆదివారం జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, అక్రమ ఖనిజ స్మగ్లింగ్‌ను నివారించడానికి, ఖనిజ వనరులను రవాణా చేసే అన్ని రకాల సరుకులకు తప్పనిసరిగా నిఘా పరికరాలను అమర్చాలి. ఈనేపథ్యంలో ఆదివారం నుండి జీపీఎస్ అమర్చని ఖనిజ వాహనాలకు రవాణా అనుమతులు జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. జీపీఎస్ పరికరం, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ప్లేట్ లేని వాహనాలను జప్తు చేస్తారని, యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.


