– డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ప్రశంసలు
సాక్షి, చైన్నె: ప్రజా జీవితంలో ఒక వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పడానికి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సజీవ ఉదాహరణ అని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కొనియాడారు. ఆయన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తాయని ప్రశంసించారు. చైన్నెలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మనవరాలు ,ఎంపీ కదిర్ ఆనంద్ కుమార్తె సెంథామరై , దీపక్ రవిల వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు.
రాజకీయ పయనం – 16 ఏళ్లకే నాయకత్వం
దురైమురుగన్ 16 ఏళ్ల చిన్న వయస్సులోనే తమ సొంత ఊరైన కాంగుప్పంలో శాఖా కార్యదర్శిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, నేడు డీఎంకే వంటి ఒక మహా ఉద్యమానికి ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని స్టాలిన్ గుర్తుచేశారు. 1965 నాటి హిందీ వ్యతిరేక పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గుర్తించి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీర్చిదిద్దిన మహా యోధుడు దురైమురుగన్ అని అభివర్ణించారు. 1963లో చైన్నె పచ్చయ్యప్పన్ కళాశాల వేడుకలో దురైమురుగన్ ప్రసంగానికి ముచ్చటపడిన ఎంజీఆర్, ఆయన విద్యాభ్యాసానికి ఎంతో సాయపడ్డారని చెప్పారు.
సిద్ధాంతానికే ప్రాధాన్యత
ఎంజీఆర్ డీఎంకే నుండి విడిపోయి కొత్త పార్టీ పెట్టినప్పుడు, దురైమురుగన్‌ను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించినప్పటికీ.. ‘మీరు నా చదువుకు సాయం చేశారు, ఎంతో ప్రేమ చూపారు. కానీ సిద్ధాంతం విషయానికి వస్తే నాయకుడు కరుణానిధే నా మార్గదర్శి’ అని చెప్పి డీఎంకేలోనే నిలబడ్డారని స్టాలిన్ గుర్తుచేశారు. శాసనసభలో ఆయన చేసిన ప్రసంగాలు, వివేకవంతమైన వ్యాఖ్యలు, హాస్యంతో కూడిన వాదనలు శాసనసభ చర్చలకే ప్రత్యేక శోభను తెచ్చాయని కొనియాడారు. గతంలో ఎంజీఆర్ హయాంలో శాసనసభ నిషేధాన్ని ఎదుర్కొన్నప్పుడు, కరుణానిధి వారిని ఉరుము–మెరుపు–వర్షం అని పిలుస్తూ నిర్వహించిన ప్రచారంలో మెరుపు దురైమురుగన్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నిలిచిపోయాయని పేర్కొన్నారు. అనంతరం, ఇంటికి వెలుగుగా.. దేశానికి సేవకులుగా కొత్త దంపతులు సంతోషంగా జీవించాలని స్టాలిన్ ఆశీర్వదించారు.


