మానవ్‌–తనీషా జంటకు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ | - | Sakshi
Sakshi News home page

మానవ్‌–తనీషా జంటకు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

– ఫైనల్‌కు దూసుకెళ్లిన సుతీర్థ ముఖర్జీ

సాక్షి, చైన్నె: తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సౌజన్యంతో తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో జరుగుతున్న డబ్ల్యూటీటీ ఫీడర్‌ చైన్నె 2026 టోర్నమెంట్‌లో భారత ప్యాడ్లర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆదివారం హోరాహోరీగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ మానవ్‌ ఠక్కర్‌ – తనీషా కొటేచా జంట ఛాంపియన్లుగా నిలిచింది.

హోరాహోరీగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌..

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తుది పోరులో మానవ్‌ – తనీషా ద్వయం 3–2 (15–17, 11–6, 11–7, 10–12, 11–6) తేడాతో టోర్నీలో సంచలనాలు సృష్టించిన క్వాలిఫయర్స్‌ జంట మెహన్‌ సెంథిల్‌ – అనన్య మురళీధరన్‌లను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి గేమ్‌ను చేజార్చుకున్నప్పటికీ పుంజుకున్న మానవ్‌–తనీషా జంట, నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని అందుకుంది. మానవ్‌–తనీషా జంట క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ ఆకాష్‌ పాల్‌ – సుతీర్థ ముఖర్జీలను, సెమీస్‌లో మూడో సీడ్‌ పయాస్‌ జైన్‌ – సయాలీ వానీలను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా,క్వాలిఫయర్స్‌ జంట మెహన్‌–అనన్యలు రెండు, నాలుగో సీడ్‌ జట్లను ఓడించి ఫైనల్‌ వరకు రావడం గమనార్హం.

సింగిల్స్‌ విభాగాల్లో భారత ఆటగాళ్ల జోరు

పురుషుల సింగిల్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న మానవ్‌ ఠక్కర్‌, పురుషుల సింగిల్స్‌లోనూ ఫైనల్‌కు చేరి డబుల్‌ సాధించేందుకు సిద్ధమయ్యాడు. క్వార్టర్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌ను ఓడించిన మానవ్‌, సెమీఫైనల్స్‌లో రెండు గేమ్‌లు వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని 3–2 (5–11, 8–11, 11–8, 11–5, 14–12) తేడాతో మూడో సీడ్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌పై సంచలన విజయం సాధించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన 10వ సీడ్‌ శామ్యూల్‌ వాకర్‌తో మానవ్‌ తలపడనున్నాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఐదో సీడ్‌ సుతీర్థ ముఖర్జీ ఊహించని రీతిలో కొరియాకు చెందిన టాప్‌ సీడ్‌ యాంగ్‌ హా యున్‌ను 3–0 (11–4, 11–7, 13–11) నేరుగా గేమ్‌లలో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్ళింది. ఫైనల్‌ పోరులో సుతీర్థ రెండవ సీడ్‌ యూ జెరిన్‌ (కొరియా)తో తలపడనుంది. పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ పయాస్‌ జైన్‌ – ప్రియానుజ్‌ భట్టాచార్య (4వ సీడ్‌) వర్సెస్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ – హర్మీత్‌ దేశాయ్‌ (2వ సీడ్‌). మహిళల డబుల్స్‌ ఫైనల్‌ కిమ్‌ సియోయున్‌ – జియోంగ్‌ యీన్‌ (3వ సీడ్‌) వర్సెస్‌ లీ హేలిన్‌ – కిమ్‌ గ్యురిన్‌ (10వ సీడ్‌) (ఆల్‌–కొరియన్‌ ఫైనల్‌) మధ్య జరగనున్నాయి. అక్టోబర్‌ 28న ప్రారంభమైన ఈ 5 రోజుల టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌ మనీ 30,000 అమెరికన్‌ డాలర్లు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement