త్వరలో ఉత్తర్వులు మంత్రి రాజ్‌మోహన్ వెల్లడి అధికారులు, ఉద్యోగులు ఇక పంచె, చొక్కతో దర్శనం ఘనంగా తమిళనాడు దినోత్సవం ప్రజలకు విజయ్, స్టాలిన్, పళణి శుభాకాంక్షలు
సాక్షి, చైన్నె: చైన్నె మ్యూజియం హాల్‌లో తమిళ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తమిళనాడు దినోత్సవ’ వేడుకలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌మోహన్ ఈ సందర్భంగా మూడు కీలక ప్రకటనలు చేశారు. వారానికి ఒక రోజు సంప్రదాయ దుస్తుల దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వస్త్రధారణపై మంత్రి మాట్లాడారు. శ్రీమంత్రులు, అధికారులు వారానికి ఒక రోజు ధోతీ–చొక్కా ధరించి వస్తే ఆ వాతావరణం పండుగలా కళ్లకు కాంతివంతంగా ఉంటుందన్నారు. ఈ విషయమై సీఎం విజయ్‌తో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
సచివాలయంలో ప్రత్యేక తమిళ సంఘం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సంఘాలను ఏకీకృతం చేసేందుకు సచివాలయంలో ఒక ప్రత్యేక తమిళ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రెండవ ప్రకటన చేశారు. ఈ సంఘానికి ముఖ్యమంత్రి స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులను సమన్వయం చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించనున్నామని, త్వరలోనే తమిళనాడు కేంద్రంగా ప్రపంచ తమిళ సదస్సును పునఃప్రారంభించి ఘనంగా నిర్వహిస్తామని మంత్రి రాజ్‌మోహన్ మూడవ ప్రకటన చేశారు.
76 మంది పండితులకు
తమిళ చెమ్మల్ అవార్డులు
సాయంత్రం జరిగిన ఈ వేడుకలో 76 మంది తమిళ పండితులకు తమిళ్ చెమ్మల్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనంద్, ఆదవ్ అర్జున వన్నియరసు, విజయ లక్ష్మి తదితరులు హాజరయ్యారు. తమిళ పండితులు, రచయితులు రాజ్ గౌతమన్, చరణ్ భాస్కరన్, టీఎంఎం అమ్మద్, కందస్వామి, పీర్ మహ్మద్‌ల పుస్తకాలను ఈ సందర్భంగా జాతీయం చేశారు. వీటి కోసం ఒకొక్కరికి రూ.10 లక్షల కాపీ రైట్ పరిహారం నగదు అందజేశారు. ఇక, తమిళనాడు కోసం పోరాడిన వారికి అందజేస్తున్న పింఛన్‌ను రూ. 7500 నుంచి రూ.10 వేలకు పె ంచి అందజేశారు. అలాగే తిరుక్కురళ్‌ను పూర్తిగా చదివి ముగించిన 179 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తారు. అలాగే 5వ తమిళనాడు జాతీయ పుస్తక డిపాజిటరీని కూడా విడుదల చేశారు. కళలు, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం అన్ని పార్కులలో జానపద కళాకారులతో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళాశాల విద్యార్థుల కోసం జిల్లా , రాష్ట్ర స్థాయిలలో వ్యాస రచన, ప్రసంగ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు , సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
తమిళనాడు దినోత్సవ శుభాకాంక్షలు
తమిళనాడు దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామ్‌దాస్, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఎండీఎంకే నేత వైగో తదితర ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం విజయ్ స్పందిస్తూ, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడి తమిళనాడు అవతరించిన ఈ పవిత్ర దినాన, మన రాష్ట్ర విశిష్టతను, చారిత్రక ఘనతలను స్మరించుకోవడం గర్వకారణం అని తెలిపారు. మాతృభాష అయిన తమిళాన్ని పరిరక్షించడానికి, తమిళ ప్రాంతాల ఐక్యత కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు ఎల్లవేళలా మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, తిరుత్తణి, హోసూర్, కన్యాకుమారి, సెంగోట్టై వంటి ప్రాంతాలు రాష్ట్రంలో భాగం కావడం వెనుక అనేక మంది వీరుల సుదీర్ఘ పోరాటాలు, ప్రాణత్యాగాలు ఉన్నాయని తెలిపారు.
పుదుచ్చేరి విమోచన దినోత్సవం
పుదుచ్చేరి రాష్ట్ర శీఘ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని పుదుచ్చేరి వ్యవసాయ, క్రీడల శాఖ మంత్రి జి.ఎన్.ఎస్. రాజశేఖరన్ స్పష్టం చేశారు. కారైకల్‌లో నిర్వహించిన 72వ పుదుచ్చేరి విమోచన (స్వాతంత్య్ర) దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరి, కారైకల్, మాహే , యానాం ప్రాంతాలు 1954 నవంబర్ 1న భారతదేశంలో విలీనమయ్యాయి. వివిధ సంస్థల విజ్ఞప్తి మేరకు పుదుచ్చేరి ప్రభుత్వం 2014 నవంబర్ 1 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజును అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కారైకల్ బీచ్ రోడ్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జి.ఎన్.ఎస్. రాజశేఖరన్ జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల పరేడ్ వందనాన్ని స్వీకరించారు. సబ్–కలెక్టర్ పూజ, జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ ఘట్కేలతో కలిసి మంత్రి శాంతి పావురాలను గాల్లోకి వదిలారు.కారైకల్‌లో 30 పడకల ఆయుష్ ఆసుపత్రి, 50 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ల ఏర్పాటు, క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి 400 మీటర్ల ఆర్టిఫిషియల్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం, కారైకల్ విభిన్న సంస్కతుల సమ్మేళనమని, ఈ ప్రాంత ప్రాముఖ్యతను కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పాఠశాల విద్యార్థులు, వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


