సాక్షి, చైన్నె: మద్రాస్ రౌండ్ టేబుల్ 1 ఆధ్వర్యంలో ఛార్జ్‌బీ చైన్నె రన్స్ 2026 ఐదవ ఎడిషన్ ఆదివారం చైన్నె నగరంలో ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరి గింది. క్రీడా స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను చాటు తూ నిర్వహించిన ఈ మారథాన్‌లో 14,000 మందికి పైగా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
దివ్యాంగ పిల్లల సమ్మిళిత విద్యే ప్రధాన లక్ష్యం..
ఈ ఏడాది నిర్వహించిన మారథాన్ ద్వారా సేకరించిన నిధులను దివ్యాంగ (ప్రత్యేక అవసరాలు కలిగిన) పిల్లల సమ్మిళిత విద్య , పునరావాసం కోసం కృషి చేస్తున్న పీఏఎస్‌టీఎన్, ఆర్‌సీఐఈటీ కార్యక్రమానికి అందజేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా చైన్నె తారామణిలోని క్యాంపస్‌లో సమ్మిళిత తరగతి గదులు, ఉపాధ్యాయులకు వనరుల గ్రంథాలయం, కౌన్సెలింగ్ కేంద్రాలు, దివ్యాంగ పిల్లలకు అనుకూలమైన ఆధునిక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈమారథాన్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ హాజరై జెండా ఊపారు. ఈ మారథాన్‌లో 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ, హాఫ్ మారథాన్ విభాగాలతో పాటు ప్రత్యేకంగా ఇన్ క్లూజివ్ రన్ కూడా నిర్వహించారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి అనిరుద్ బహుమతులు ప్రధానం చేశారు. ఈసందర్భంగా అనిరుధ్ మాట్లాడుతూ: దివ్యాంగ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే ఒక మంచి ఆశయం కోసం ఇంతమంది ప్రజలు ఒకే వేదికపైకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.


