● చైన్నెలో టాస్మాక్ ఉద్యోగుల నిరసన
అన్నానగర్: చైన్నెలోని అంబత్తూరులో ఉన్న తమిళనాడు స్టేట్ మర్కంటైల్ కార్పొరేషన్ (టాస్మాక్) మద్యం గిడ్డంగి ముందు, చైన్నె జిల్లాలోని అన్ని టాస్మాక్ యూనియన్లకు చెందిన సంఘటిత కార్మికులు పని బహిష్కరణ నిరసనలో పాల్గొన్నారు. ఖాళీ మద్యం సీసాలను తిరిగి తీసుకుని, రూ. 10 వాపసు ఇచ్చే పథకానికి వ్యతిరేకంగా 500 మందికి పైగా టాస్మాక్ ఉద్యోగులు నిరసనలో పాల్గొని నినాదాలు చేశారు. టాస్మాక్ ఉద్యోగులు చేపట్టిన ఈ ఆకస్మిక సమ్మె కారణంగా, చైన్నె, తిరువళ్లూరు తూర్పు, మదురై, ఈరోడ్, కరూర్, వెల్లూరు, కన్యాకుమారి మరియు కృష్ణగిరితో సహా పలు జిల్లాల్లోని టాస్మాక్ దుకాణాలు మూతపడ్డాయి. ఈనేపథ్యంలో మద్యం కొనడానికి వచ్చిన మద్యం ప్రియులు నిరాశతో వెనుదిరిగారు. టాస్మాక్ ఉద్యోగుల ఈ ఆకస్మిక నిరసన పలు జిల్లాల్లో కోట్ల రూపాయల మద్యం అమ్మకాలను ప్రభావితం చేయడంతో పాటు మార్కెట్లలో కలకలం సృష్టించింది.
తిరువళ్లూరు: నియోజకవర్గంలోని మూడు యూనియన్‌లలో వున్న 300 మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం ఆదివారం పేరంబాక్కంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించారు. తిరువళ్లూరు నియోజకవర్గంలోని పూండి, తిరువేలాంగాడు, కడంబత్తూరు తదితర మూడు యూనియన్‌లోని 300 వందల మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్‌కుమార్ హాజరై గర్భిణులకు గాజులు, పసుపు కుంకుమ, పౌష్టికాహార కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చిన మొదటి ఆరునెలల్లో కనీసం పది కేజీల వరకు బరువు పెరగాలని, మిగిలిన నాలుగు నెలల్లో కనీసం రెండు కిలో మేరకు పెరగాలని సూచించారు.


