● నాటు తుపాకులు స్వాధీనం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని సింగారెట్టియూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు కాట్పాడి అటవీ అధికారి కందసామికి రహస్య సమాచారం అందింది. ఈ మేరకు అటవీ సిబ్బంది ఆనంద్, సోమసుందరం, అటవీ సిబ్బంది శనివారం రాత్రి గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకులతో పాటూ అటవీ జంతువులను వేటాడి, శుభ్రం చేస్తూ కనిపించారు. వారిని గమనించిన అటవీ శాఖ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అటవీ సిబ్బందిని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు తుపాకులు, వేటాడిన అడవి జంతువులను అక్కడే వదిలేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీటిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి రాత్రుళ్లు వేటకు వెళ్లే వారిని గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
సాక్షి, చైన్నె: కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (చైన్నె జోన్) ఆధ్వర్యంలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించిన విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ ఘనంగా ముగిశాయి. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ‘‘విజిలెన్స్ – అభివృద్ధికి నిజాయితీ ప్రాతిపదిక’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. అక్టోబర్ 26న బ్యాంక్ ఆఫ్ ఇండియా చైన్నె జోనల్ మేనేజర్ శ్రీ మోహన్ మరేతి అధ్యక్షతన నిర్వహించిన నిజాయితీ ప్రతిజ్ఞ కార్యక్రమంతో ఈ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జోనల్ ఆఫీస్, వివిధ శాఖలకు చెందిన సిబ్బంది ఈ ప్రతిజ్ఞలో పాల్గొని, అవినీతి రహిత పాలన, నైతిక విలువలకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. అక్టోబర్ 27న క్విజ్ పోటీలు, అక్టోబర్ 28న ఉద్యోగుల అవగాహనా సదస్సు నిర్వహించారు.అక్టోబర్ 29న గుమ్మిడిపూండిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 30వ తేదీన చైన్నె జోన్ పరిధిలోని అన్ని శాఖలలో ఉద్యోగులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. వారోత్సవ ముగింపు సందర్భంగా చైన్నె జోనల్ ఆఫీస్, అన్ని బ్రాంచ్‌ల వద్ద ఉద్యోగులు మానవహారంగా) ఏర్పడి అవినీతి రహిత సమాజ నిర్మాణం పట్ల తమ నిబద్ధతను చాటారు.ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా నిఘా, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక పని సంస్కతిని పెంపొందించడంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంటుందని జోనల్ నిర్వహణ విభాగం స్పష్టం చేసింది.


