న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: రాజధాని చైన్నె, శివారు ప్రాంతాల్లో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని చోట్ల అప్పుడపుప తేలికపాటి వర్షం కురిసింది. ఉత్తర తమిళనాడు తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటలలో తిరుప్పూర్, కోయంబత్తూరులో అత్యధికంగా 16 సెం.మీ, కడలూరులో 15 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం నమోదైంది.
తెన్ పైన్నె నదికి వరద హెచ్చరిక
కృష్ణగిరి జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సోమవారం ఉదయం జనజీవనం స్తంభించిపోయింది. పది సెం.మీ మేరకు వర్షం పడటంతో ఓల్డ్ పైట్టె సిటీ బస్ స్టేషన్, నేతాజీ నగర్, నల్లతంబి వీధుల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు పాత్రలతో నీటిని బయటకు తోడుకుంటున్నారు. కేఆర్పీ డ్యామ్‌కు నీటి ప్రవాహం సెకనుకు 2,382 క్యూసెక్కులకు పెరగడంతో డ్యామ్ నిండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తెన్్ పైన్నె నది పొంగిపొర్లుతుండటంతో కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలై జిల్లాల ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేశారు.
చౌత్తల్లి గ్రామంలో ప్రజలు రూ. 8 లక్షల సొంత నిధులతో నిర్మించుకున్న కల్వర్ట్ వంతెన వరదకు కొట్టుకుపోవడంతో 100 కుటుంబాలు 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి న పరిస్థితి ఏర్పడింది. బర్కూర్ సమీపంలోని కొట్టూరులో పొలంపై పిడుగు పడటంతో ఒక్కసారిగా 10 చోట్లకు పైగా భూమి నుంచి నీటి ఊటలు పొంగిపొర్లడం స్థానికంగా కలకలం రేపింది.
నాగై, మైలాడుతురైలో పంట మునక
కావేరీ నీరు ఆలస్యంగా విడుదల కావడం, కాలువలు సరిగ్గా తవ్వకపోవడంతో నాగపట్నం, మైలాడుతురై జిల్లాలోని రైతులు తీవ్రంగా ఇప్పటికే నష్ట పోయారు.తాజావ ర్షాలకు తరంగంబాడి, సిర్కాళి, తిరువిళంతూరు, కొల్లిడం పరిసర ప్రాంతాల్లో దాదాపు 2,000 ఎకరాల్లో నాటిన సంబ వరి పంట నీటమునిగింది. నాగపట్నంలో 1500 ఎకరాలలో నీళ్లు చేరింది.నీరు నిలిచిపోవడంతో పంట కుళ్ళిపోయే ప్రమాదం ఉందని, వెంటనే జలవనరులు , వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోయంబత్తూరును ముంచెత్తిన వరదలు
కోయంబత్తూరు జిల్లాలోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉక్కడం, గాంధీపురం, కునియముత్తూరు, సెల్వపురం, ప్రభునగర్, సావిత్రి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. చెరువులు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు,తేని,తెన్కాసి , తిరునల్వేలి తదితర జిల్లాలో వర్షాలు మోస్తారుగా కొనసాగుతున్నాయి.
వర్షాల ధాటికి 14 మంది మృతి
రాష్ట్రంలో వర్షాలు, పిడుగుపాటు , వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగోట్టయ్యన్ వెల్లడించారు. దిండిగల్ సమీపంలో విద్యుత్ తీగలు తాకి ఒక మహిళ (చిత్ర), కాలువలో జారిపడి మరో వ్యక్తి (ముత్తుస్వామి), అలాగే వర్షపు నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు (అంకేష్) ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేస్తామని మంత్రి తెలిపారు.
అర్నాబ్ తుపాను ముప్పు తొలగినట్టే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అర్నాబ్ తుపానుగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చి, విశాఖపట్నం – బాపట్ల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈతుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను కారణంగా తమిళనాడుకు ముప్పు లేదని తేల్చారు. అదే సమయంలో తమిళనాడులో ప్రస్తుతం వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కోయంబత్తూరు రోడ్లపై వరద నీరు
కృష్ణగిరిలో ఇళ్లలోకి చేరిన నీరు
నాగైలో నీట మునిగిన పంట పొలాలు
కొడైకెనాల్లో విలయం
కొడైకెనాల్లో రాత్రి భారీ వర్షం పడటంతో ఉత్తుక్కుళం – పెరియకుళం పర్వత రహదారిపై కొండచరియలు విరిగిపడి రాళ్లు, బండరాళ్లు రోడ్డుపై పడటంతో మూడో రోజు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉత్తుక్కుళం, తమరైకుళం, పలమలైతో సహా 10కి పైగా గ్రామాలు ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయి ఒంటరి దీవులుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో ఇబ్బంది పడుతున్నారు. పళని–కొడైకెనాల్ ఘాట్ రోడ్డులో పీఎల్ఎల్ చేత్, సవరికాడు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో పాటు భారీ వర్షానికి రోడ్లు దెబ్బతిన్నాయి. జేసీబీలు, పొకై ్లన్ యంత్రాలతో సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తమిళనాడులో పలు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. పశ్చిమ కనుమలు , దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక, అర్నాబ్ తాపానుతో తమిళనాడుకు ఎలాంటి ముప్పు అన్నది లేదని ప్రకటించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా పశ్చిమ కనుమల జిల్లాలు, దక్షిణ తమిళనాడులో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.


