● ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత చీర, ధోవతికి బదులుగా నగదు ● రూ. 1,000 ఇవ్వడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,చైన్నె: దీపావళి పండగ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం ఎస్సీ , ఎస్టీ వర్గాల ప్రజలకు తీపి కబురు అందించింది. ప్రతీ ఏటా అందించే ఉచిత ధోవతి, చీర పంపిణీకి బదులుగా, ఈసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే రూ. 1,000 నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సంక్షేమ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 13.38 కోట్లు కేటాయించింది. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం సహా నాలుగు ప్రాంతాల్లో నివసిస్తున్న 18 ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకంకోసం సుమారు రూ. 13.38 కోట్లు కేటాయించారు. ఈ పథకంద్వారా 47,180 కుటుంబరేషన్ కార్డులకు సంబంధించి మొత్తం 1,33,890 మందికి లబ్ది చేకూర్చనన్నారు. ఇందులో పురుషులు 60,877 మంది, మహిళలు 73,013 మంది ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఆది ద్రావిడ , షెడ్యూల్డ్ తెగల వ్యక్తికి ఈ పండగ కానుక లభిస్తుంది. పండగ వేళ తమకు నచ్చిన దుస్తులు లేదా అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ, డిజిటల్ చెల్లింపుల ద్వారా ఈ నగదును నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చైన్నె కమిషనరేట్‌లో నిజాయితీ ప్రతిజ్ఞ
సాక్షి,చైన్నె : చైన్నె గ్రేటర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ. అమల్‌రాజ్ ఆదేశాల మేరకు వేపేరిలోని కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల సందర్భంగా నైతిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అదనపు పోలీస్ కమిషనర్ (ఉత్తర విభాగం) కపిల్ కుమార్ సి. శరత్కర్ నాయకత్వంలో పోలీస్ అధికారులు, సిబ్బంది , పరిపాలనా యంత్రాంగం అవినీతిని నిర్మూలించి నిరోధకత, నిజాయితీ , గౌరవంతో పనిచేస్తామని ఈ ప్రతిజ్ఞ స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ (ఇంటెలిజన్స్)డాక్టర్ సంతోష్ హాదిమణి , డిప్యూటీ కమిషనర్‌లు ఎ. సుబ్బులక్ష్మి , స్టీఫెన్ జేసుపాదమ్ , సుజాతలతో పాటు పెద్దసంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది , మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,414 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది.


