సాక్షి, చైన్నె: తమిళనాడులో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతికి మారుపేరుగా నిలిచే తమిళనాడులో ఇప్పుడు కనీస శాంతిభద్రతలు కూడా కరువయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. రోజూ చోటుచేసుకుంటున్న దారుణాలను ప్రచురించడానికి దినపత్రికలు ప్రత్యేక శీర్షికలను కేటాయించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
సీఎంపై వ్యాఖ్యల దాడి
అధికారాన్ని కాపాడుకోవడానికి నియోజకవర్గాల్లో ట్రాక్టర్లు నడపడం, టీ తాగడం, మునగకాయలు కోయడం వంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న సీఎం విజయ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఒక్క సమీక్షా సమావేశమైనా నిర్వహించారా? అని ప్రశ్నించారు. బూటకపు ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే రాష్ట్రంలో ఈ రౌడీ సామ్రాజ్యం ఏలుబడి సాగుతోందా? అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అరాచకాలకు నిదర్శనంగా పలు దారుణ ఘటనలను ఆయన ఎత్తిచూపారు. మదురై (మేలూరు)లో అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలతో శవమై తేలడం, సేలంలో పట్టపగలే డేవిడ్ అనే రౌడీని వేటకొడవళ్లతో నరికి చంపడం, తూత్తుకుడి సాతన్‌కుళంలో మహిళ దారుణ హత్య, అలాగే శ్రీవైకుంఠంలో కళాశాల విద్యార్థిని నరికివేత, కన్యాకుమారిలో సొంత భర్తనైనా దారుణంగా అంతమొందించిన టీఆర్పీ మహిళా కార్యదర్శి అరెస్ట్ వంటి సంఘటనలను వివరించారు. ఈమేరకు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉంటే, ఒక్క సమీక్షా సమావేశమైనా నిజంగా జరిగి ఉంటే ఈ వరుస హత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించిన ఆయన, వెంటనే ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.


