చెంబరంబాక్కంలో సీఎం విజయ్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చెంబరంబాక్కంలో సీఎం విజయ్‌ పరిశీలన

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, సీఎం జోసెఫ్‌ విజయ్‌ సోమవారం సాయంత్రం కాంచీపురం జిల్లా, కుండ్రత్తూర్‌ పరిధిలోని చెంబరంబాక్కం రిజర్వాయర్‌ను సందర్శించి సమగ్ర తనిఖీలు చేపట్టారు. రిజర్వాయర్‌ గేట్లు, కట్ట ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన సీఎం ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌, అవుట్‌ ఫ్లో గురించి, వరద నివారణ చర్యల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ రిజర్వాయర్‌ నీటిమట్టం 24 అడుగులు కాగా, ప్రస్తుతం 14.76 అడుగులకు నీరు ఉంది. నీటి రాక 150 క్యూ సెక్కులు కాగా, అవుట్‌ ప్లో 208 క్యూ సెక్కులుగా ఉన్నాయి. గతంలో ఈ రిజర్వాయర్‌ రూపంలో చైన్నె నీట మునిగిన నేపథ్యంలో తాజాగా 24 గంటలూ నిరంతరం పర్యవేక్షించాలని, కంట్రోల్‌ రూమ్‌లలో తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే ఒకవేళ అదనపు నీటిని విడుదల చేయాల్సి వస్తే, ఆకస్మికంగా కాకుండా దశలవారీగా, నియంత్రిత పద్ధతిలో మాత్రమే నీటిని వదలాలని స్పష్టం చేశారు. అడయార్‌ నది దిగువన ఉన్న చైన్నె నగర నివాస ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా పక్కాగా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు.నీటిని విడుదల చేయడానికి ముందే దిగువ ప్రాంత ప్రజలకు తగిన సమాచారం అందించాలని.. రెవెన్యూ, పోలీస్‌, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌, వాటర్‌ బోర్డు శాఖలతో పూర్తి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గేట్ల ఎత్తే మెకానిజం, జెనరేటర్లు, టెలికాం లైన్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, చైన్నె నగర తాగునీటి అవసరాలకు తగిన నీటిని నిల్వ చేస్తూనే వరద నిర్వహణ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మంత్రులు సెంగోట్టయ్యన్‌, ఆనంద్‌, తెన్నరసు, రంజిత్‌కుమార్‌, సీఎస్‌ సాయికుమార్‌ తదితరులు ఉన్నారు.అనంతరం సీఎం విజయ్‌ కుండ్రత్తూరు పరిసరాలలో అభిమానులను పలకరించే విధంగా నడచుకుంటూ కొంత దూరం రోడ్‌ షోతో ముందుకు సాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement