సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. డీఎంకే ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అన్బిల్ మహేష్‌ను చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల్లోనే కారులో అమింజికరైవద్ద వెళ్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చైన్నె పోలీసు కమిషనరేట్‌కు తరలించారు.
కేసు నేపథ్యం ఇదీ..
2021–2026 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో అన్బిల్ మహేష్ పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రైవేట్ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు, ఇతర అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. పాఠశాల నిర్వాహకుల నుంచి సుమారు రూ. 100 కోట్ల మేర లంచం తీసుకుని మోసానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.ఈ కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌తో పాటు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్, కార్యదర్శి, కోశాధికారి ముత్తుకుమార్‌లపై సీసీబీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈకేసును డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరెప్షన్ (డీవీఏసీ)విభాగం తన గుప్పెట్లోకి తీసుకుంది. డీవీఏసీ , సీసీబీ వర్గాలు తిరుచ్చి,చైన్నె తదితర జిల్లాలో ఉన్న అన్బిల్ మహేష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.సీసీబీ పోలీసులు ఆయన వద్ద తీవ్రంగా విచారణ కూడాచేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారన్న భావనతో అన్బిల్ మహేష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
అమింజికరై నివాసంలో అరెస్ట్
హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటలలోనే పోలీసులు అన్బిల్ మహేష్‌ను టార్గెట్ చేశారు. చైన్నె అమింజికరైలోని నివాసం నుంచి కారులో బయటకు వెళ్లే సమయంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం వేపెరిలోని చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటుగా విచారణ జరిపి ,న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ అరెస్టు సమాచారంతో అన్బిల్ మహేష్ సొంత జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన మద్దతుదారులు, డీఎంకే వర్గాలుపలు చోట్ల ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను న్యాయమూర్తి ఎదుట రాత్రి సమయంలో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే, డీఎంకే మాజీమంత్రులను టార్గెట్ చేస్తూ వస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా అన్బిల్ మహేష్‌ను అరెస్టు చేయడం గమనార్హం. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల నగారా మోగే అవకాశాల నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన డీఎంకే కీలక నేతను అక్రమంగా టీవీకే ప్రభుత్వం అరెస్టు చేసిందని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచే స్తున్నాయి. ఓటమి భయంతో అన్బిల్ మహేశ్‌ను అక్రమ కేసులో ఇరికించి ఉన్నారని డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అరెస్టును డీఎంకే నేత ఎంకే స్టాలిన్, యువజన నేత ఉదయ నిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితరులు తీవ్రంగా ఖండించారు.
ముందస్తు బెయిల్ తిరస్కరణ
రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు అన్బిల్ మహేష్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించారు. పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.


