సాక్షి, చైన్నె: దేశంలో నెలకొన్న విద్యుత్ కొరతకు కేంద్ర ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమని తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందని, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు యూనిట్‌కు రూ. 46 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆయన విమర్శించారు. చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో 82 కొత్త విద్యుత్ కోత ఉపశమన కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర వైఫల్యంతోనే విద్యుత్ కొరత
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్న మంత్రి, రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల కొరత మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరైన వ్యూహాలు రూపొందించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.: తమిళనాడు విద్యుత్ బోర్డులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి మరో వారంలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. రాష్ట్రంలో వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని, సరిపడా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
డీఎంకేపై తీవ్రస్థాయిలో విమర్శలు
సెంజిలో చిన్నారి అదృశ్యం ఘటనపై స్పందిస్తూ డీఎంకే వైఖరిని మంత్రి ఎండగట్టారు. తప్పిపోయిన బాలికను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెబుతూ, గత డీఎంకే హయాంలో కేఎన్ నెహ్రూ సోదరుడు రామజయం హత్య కేసును కూడా స్టాలిన్ పరిష్కరించలేకపోయారని విమర్శించారు. డీఎంకేకు చిన్నారుల రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి పాలనలో నిధుల వసూళ్లు, కట్–పంచాయతీలే ప్రాధాన్యంగా సాగాయని ఆరోపించారు. అధికారంలోకి వస్తే కోడనాడు ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పిన డీఎంకే, రాజకీయ లబ్ధి లేకపోవడంతో ఆ కేసే పట్టించుకోలేదని మండిపడ్డారు. డబ్బు కోసం పాకులాడినందుకే ప్రజలు డీఎంకేను తిరస్కరించారని మంత్రి నిర్మల్ కుమార్ వ్యాఖ్యానించారు.


