‘పారా’ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

‘పారా’ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

సాక్షి,చైన్నె: జపాన్‌లో జరిగిన పారా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి సత్తా చాటిన తమిళనాడు పారా అథ్లెట్లను ముఖ్యమంత్రి విజయ్‌ అభినందించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు, యువతరానికి తమిళనాడు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్‌ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా క్రీడాకారులను ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

15 పతకాలతో అద్భుత ప్రతిభ..

జపానన్‌లో ముగిసిన పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు క్రీడాకారులు 3 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్య పతకాలతో మొత్తం 15 పతకాలు గెలుచుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులు తమ జీవితాల్లోని వివిధ సవాళ్లను అధిగమించి, నిరంతర శిక్షణ, అచంచలమైన సంకల్పం మరియు తీవ్రమైన అంకితభావంతో ఈ విజయాలను సాధించారని కొనియాడారు. వారి ప్రతి విజయమూ ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు.పారా అథ్లెట్ల విజయాలు తమిళనాడు క్రీడా పరాక్రమాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై భారతదేశ కీర్తిని మరింతగా పెంచాయని కొనియాడారు. యువతలో ఉన్న క్రీడా ప్రతిభను మరింతగా తీర్చిదిద్ది, వారు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించేలా తమిళనాడు ప్రభుత్వం అన్ని వేళలా తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి విజయ్‌ భరోసా ఇచ్చారు.

రాజకీయాల్లో

గందర గోళానికి ప్రయత్నం

● అమల్లో ఆపరేషన్‌ డి

● పీఎన్‌సీసీ నేత మాణిక్యం ఠాకూర్‌

సాక్షి,చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ మణికం ఠాగూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించి, అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చైన్నెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తమిళనాడును తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నాయకత్వంలో ‘ఆపరేషన్‌ డి’ పేరిట ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని మణికం ఠాగూర్‌ ఆరోపించారు. ఇందులో భాగంగా బీజేపీ మూడు ప్లాన్లను వ్యూహాత్మకంగా అమలు చేస్తోందని విమర్శించారు.

ప్లాన్‌ ఏ .. అన్నాడీఎంకే పార్టీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్లాన్‌ బి అన్నామలై ద్వారా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసి, ఎన్జీవో ముసుగులో ఉద్యమాలను నడపడం, ప్లాన్‌ సితోఆపరేషన్‌ డి అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రముఖ సినీ నటుడితో కొత్త పార్టీని ప్రారంభించి, అభిమాన సంఘాల ద్వారా రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గతంలో నటుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు కూడా బీజేపీ ఇలాంటి ప్రయత్నాలే చేసిందని గుర్తుచేశారు. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం చూపడానికే ఈ రాజకీయ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. కాగా చైన్నెలో నటుడు ధనుష్‌ అభిమానుల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మాణికం ఠాగూర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

రాష్ట్రంలో 50,000 కొత్త

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు

● రూ. 750 కోట్లతో అందించడానికి

ప్రభుత్వం ఉత్తర్వులు

కొరుక్కుపేట:2026–2027 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడులో 50,000 కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను అందించాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది.దీని ప్రకారం, వెనుకబడిన తరగతులతో సహా వెనుకబడిన తరగతులలో 3,215 ఉచిత కనెక్షన్లు అందించనున్నారు. అంతేకాకుండా, సాధారణ తరగతిలో 20,000 కనెక్షన్లు, గయా నిధి పథకంలో 3,372 కనెక్షన్లు, విద్యుత్‌ కనెక్షన్‌ పథకం కింద 25,282 కనెక్షన్లు, వివిధ ప్రభుత్వ పథకాల కింద 1,346 కనెక్షన్లు అందించనున్నారు. ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ. 1.5 లక్షల చొప్పున, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు, మౌలిక సదుపాయాల పనుల కోసం మొత్తం రూ. 750 కోట్లు ఖర్చు చేయనున్నారు.అలాగే, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం,ప్రభుత్వం రూ. 127.56 కోట్లను సబ్సిడీగా అందించనుంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే జారీ చేసిన ప్రత్యేక విద్యుత్‌ కనెక్షన్లలోని అవకతవకలను సమీక్షించి, తప్పుగా వాడుతున్న కనెక్షన్లను తొలగించాలని ప్రభుత్వం విద్యుత్‌ బోర్డును ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన 7,313 కనెక్షన్లు కూడా 5 కోట్ల కనెక్షన్ల లక్ష్యంలో భాగంగానే ఉన్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement