ప్రముఖ చెఫ్‌ దాము కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

ప్రముఖ చెఫ్‌ దాము కన్నుమూత

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

సాక్షి చైన్నె : తమిళనాడుకు చెందిన ప్రముఖ చెఫ్‌, టెలివిజన్‌ ప్రముఖుడు చెఫ్‌ దాము (72) అనారోగ్య కారణాలతో చైన్నెలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.

డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయ చెఫ్‌..

మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుండి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయ చెఫ్‌గా ఆయన గుర్తింపు పొందారు. 2010లో ఆయన 24 గంటల 30 నిమిషాల 12 సెకన్లలో ఏకధాటిగా 617 రకాల వంటకాలను తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. పాకకళా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2025లో ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేసింది. కాగా బుల్లితెరపై ప్రసారమైన పలు వంటల కార్యక్రమాలు, ముఖ్యంగా తమిళ పాపులర్‌ షో ’కుక్‌ విత్‌ కోమలి’ ద్వారానూ, ఇతర కార్యక్రమాల ద్వారానూ ప్రతి ఇంటా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతి తో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, తోటి చెఫ్‌లు, టెలివిజన్‌ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర సంతాపం తెలిపారు.

సీఎం విజయ్‌ సంతాపం

ప్రముఖ తమిళ పాకశాస్త్ర నిపుణుడు, టీవీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి పద్మశ్రీ చెఫ్‌ దాము (కె. దామోదరన్‌) అకాల మరణం తో సి ఎం విజయ్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. 72 సంవత్సరాల వయసున్న చెఫ్‌ దాము అనారోగ్య సమస్యల కారణంగా చైన్నెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన తన విశిష్టమైన వంట నైపుణ్యం, శైలితో టెలివిజన్‌ కార్యక్రమాల ద్వారా వంటకళను సామాన్య ప్రజల్లోకి తీసుకువచ్చారని కొనియాడారు. చెఫ్‌ దాము సాధించిన ఘనతలను స్మరిస్తూ.. ఆయన 2010లో ఒకే వ్యక్తి 24 గంటలకు పైగా సుదీర్ఘ కాలం వంట చేసి సాధించిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును, భారత ప్రభుత్వం నుండి పొందిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన మరణం పాకశాస్త్ర రంగానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. చెఫ్‌ దాము కుటుంబ సభ్యులకు, ఆయన బంధువులు, స్నేహితులు, ఆయన వంటకాల అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతిని, ఓదార్పును తెలియ జేస్తున్నానని సీఎం విజయ్‌ తెలిపారు. ఇక డీఎంకే అధ్యక్షుడు ఏం కే స్టాలిన్‌ అన్న డీఎంకే ప్రధాన కార్యదర్శి పలని స్వామి, ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ తదితరులు కూడా చెఫ్‌ దాము మృతి పై సంతాపం వ్యక్తం చేశారు. వంటను కేవలం ఒక వృత్తిగా చూడకుండా, దానిని ఒక ఉన్నతమైన కళగా మార్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పద్మశ్రీ చెఫ్‌ దాము గారి మరణం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement