తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆలయాల్లో పని చేసే కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తమిళనాడు ఆలయ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనశేఖర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తమిళనాడు ఆలయ కార్మికుల సంఘం జిల్లా సమావేశం పుట్లూరులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనశేఖర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో పని చేసే కార్మికుల కుటుంబాలకు వివాహ సహాయనిధి కింద ఇచ్చే రూ.60 వేలను రూ.లక్షకు పెంచాలి. ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి నెలసరి వేతనం ఇవ్వాలి. విశ్రాంతి పొందిన కార్మికులకు నెలకు పది వేల రూపాయలను పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.


